పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వేసిన ఒక్క అడుగు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పే అంశం అయ్యే అవకాశం కనపడుతోంది. ఇన్నాళ్లు జస్ట్ ఆరోపణలు చేస్తాడు వదిలేస్తాడు… తన ఆరోపణలు కోర్టులో నిలబడేవి కావని టీఆర్ఎస్ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదును చూసి రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్ ఇప్పుడు కేసీఆర్, బీజేపీల్లో ఎవర్నో ఒకరిని బోనులో నిలబెట్టనుంది.
అవును… రేవంత్ రెడ్డి టైం చూసి వేసిన ఎత్తుగడ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంతో ఖరీదైన ఖానామెట్ భూములను ప్రభుత్వం అప్పనంగా తన వర్గీయులకు కట్టబెట్టింది అని రేవంత్ రెడ్డి ఆరోపించాడు. భూముల వేలానికి ఎంత కవరేజ్ వచ్చిందో… ఆ భూములు ఎవరికి దక్కాయో కూడా అంతే కవరేజ్ వచ్చింది. కానీ ఎప్పట్లాగే రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని విడిచిపెట్టలేదు. భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఏకంగా సీబీఐకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.
ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ భేటీలు కొనసాగుతున్న సమయంలోనే హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడింది. దీంతో కేసీఆర్-బీజేపీ ఒక్కటేనని, ఢిల్లీ నాయకత్వానికి కేసీఆర్ తో దోస్తానా ఉందన్న ప్రచారం గుప్పుమంది. ఓ దశలో బీజేపీ శ్రేణులు కూడా డిఫెన్సులో పడ్డాయి. అంతకు ముందు కేసీఆర్ అవినీతి చిట్టా మా దగ్గర ఉందని, జైలుకు పోవటం ఖాయమంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను చాలా మంది ప్రశ్నించారు.
కానీ ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి రేవంత్ రెడ్డి స్వయంగా ఫిర్యాదు చేశారు. కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉంది కదా… ఇప్పుడు దర్యాప్తు చేయించండి అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీంతో రేవంత్ సవాల్ స్వీకరిస్తే కేసీఆర్ పై విచారణ స్టార్ట్ అవుతుంది. లేదంటే మీరిద్దరు ఒక్కటే… అంటూ రేవంత్ ఊరూరా తిరిగా ప్రచారం చేస్తారు. ఇలా బీజేపీ కోర్టులోకి బంతి విసిరిన రేవంత్ ఆ పార్టీని ఇరకాటంలోకి నెట్టివేశారు. దీంతో బీజేపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది.