తెలంగాణ ఆర్టీసీ సమ్మె… తెలంగాణకు మరో బలమైన నేతను అందించబోతుందా…? ఇన్నాళ్లు ఉద్యమ బాస్‌గా చెప్పుకున్న కేసీఆర్‌కు ఇక కాలం చెల్లినట్లేనా…? ఆర్టీసీ కార్మికుల కోసం రేవంత్ రెడ్డి రోడ్డుమీదకు రాబోతున్నారా…? కార్మిక పక్షాన ఫైట్ చేసేందుకు రేవంత్ గ్రౌండ్ సిద్దం చేసుకున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది.
రేవంత్ రెడ్డి… కేసీఆర్ వాగ్ధాటికి సరితూగే లీడర్. కేసీఆర్… వ్యూహరచనకు ప్రతివ్యూహ రచన చేసే కేపాసిటీ ఉన్న నేత. కానీ, ఉద్యమ నేతగా కేసీఆర్‌ను పూర్తిస్థాయిలో కార్నర్ చేయలేకపోయారు. ప్రజలు కూడా ఉద్యమ నేతగా మళ్లీ, మళ్లీ అవకాశం ఇచ్చారు. కానీ ఆర్టీసీ కార్మికులపై కేసీఆర్ చూపిస్తోన్న పక్షపాత వైఖరి, ప్రజాధనాన్ని ప్రైవేటు పరం చేసే నిర్ణయాలతో… కార్మికలోకం మాత్రమే కాదు, ప్రజల్లోనూ వ్యతిరేకత మొదలైంది. అయితే… వారివైపు ఎవరు నిలబడతారు, వారి కోసం ఎవరు కొట్లాడుతారులే… అని అంతా లైట్ తీసుకున్నా, అవసరమయితే… తానే రోడ్డు మీదకు వచ్చి ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడేందుకు రేవంత్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం కార్మికులను రోడ్డుమీద నిలబెడితే…ఖచ్చితంగా గల్లీ గల్లీ తిరుగుతా. అవసరమైతే రాష్ట్రంలోని ప్రతి కార్మికున్ని ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తా… వారితోనే ఉంటా, కేసీఆర్‌తో కలబడి… ప్రతి జిల్లా కాలినడకన తిరుగుతా అంటూ సన్నిహితుల వద్ద రేవంత్ రెడ్డి వాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ రాష్ట్రంలో తనను అడిగే వారే లేరని కేసీఆర్ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, 50వేల మందిని… వారి కుటుంబాల జీవితాలను చిన్నాభిన్నం చేస్తే… చూస్తూ ఊరుకుంటే మనమంతా ఉండి ఏంలాభం అని రేవంత్ రెడ్డి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మరో రెండు రోజుల్లో… ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రకటన రాగానే…ఖచ్చితంగా గల్లీలోకి రావాల్సిందేనని ఆయన, ఆయన వర్గం రెడీగా ఉన్నట్లు సమాచారం. అయితే… పోలీస్ చర్యతో ప్రభుత్వం అణిచివేసే అవకాశం కూడా ఉండటంతో, న్యాయపరమైన అంశాలను కూడా రేవంత్ టీం ఆలోచిస్తున్నట్లు సమాచారం.