ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న పోరాటానికి అండగా ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్‌కు తెలంగాణ కాంగ్రెస్ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. హక్కుల సాధన కోసం వారు చేస్తున్న ఉద్యమం ఆదర్శనీయమంటూ కొనియాడారు. లక్షలాది మంది రైతులు భార్యా, పిల్లలను వదిలేసి ఎముకలు కొరికే చలిలో, నిద్రాహారాలు లేకుండా ఆందోళన చేస్తోంటే.. మోదీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని విమర్శలు గుప్పించారు. గ్రేటర్ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ నేతలు హైదరాబాద్‌కు కదలివచ్చారే కానీ.. దేశ రాజధానిలో పది రోజులుగా రైతులు చేస్తున్న పోరాటం మాత్రం ఎవరి పట్టకపోవడం దారుణమని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
సంఖ్యా బలం ఉందన్న గర్వంతో రైతులకు వ్యతిరేకంగా రాక్షస చట్టాలను మోదీ ప్రభుత్వం ఆమోదించిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ చట్టాలు రైతులకు మేలు చేయబోవని… అంబానీ, అదానీ లాంటి బడా పారిశ్రామికవేత్తల దోపిడి మార్గం సుగమం చేస్తాయని తాము ఎంత గొంతు చించుకున్నా.. మోదీ ప్రభుత్వం మూర్ఖంగా-మొండిగా బిల్లులను ఆమోదింపజేసుకుందని విమర్శించారు. ఆయా చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లవుతాయని, వీటిని ఆమోదించవద్దని రాష్ట్రపతికి చేసిన విజ్ఞప్తి కూడా ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ చట్టాలపై సాక్షాత్తు మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ఎమ్మెల్యేనే వ్యతిరేకంగా గళం విప్పితే.. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ అయితే తన పద్మవిభూషణ్ అవార్డును వాపస్ చేస్తున్నట్టు ప్రకటించారని గుర్తు చేశారు. కానీ తెలంగాణలో మాత్రం రైతుబంధు పేరుతో ఒక పథకం పెట్టి .. అన్నదాతల సమస్యలన్నింటికి అదే పరిష్కారం అంటూ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక సగటున రోజుకు మగ్గురు రైతులు చనిపోతోంటే కేసీఆర్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని విరుచుకుపడ్డారు. నియంత్రిత సాగుపేరుతో తెలంగాణ రైతాంగ జీవితాలతో కేసీఆర్ ఆడుకున్నారని, సన్నాలకు మద్దతు ధర కేంద్రంపై నెపాన్ని నెట్టి తప్పించుకున్నారని విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా.. ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్ విజయవంతం చేయాలని కాంగ్రెస్ పిలుపునిస్తోందని చెప్పారు రేవంత్ రెడ్డి. త్వరలోనే కాంగ్రెస్ కూడా దీర్ఘకాలిక పోరాటానికి సన్నద్ధమవుతోందని రేవంత్ రెడ్డి తెలిపారు.