ఆర్టీసీకి ఉన్న 85వేల కోట్ల ఆస్తులను తన కుటుంబీకులకు కట్టబెట్టేందుకే కేసీర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని ఆరోపించారు. ఉద్యమంలో లేని మంత్రుల బాధ్యతారహిత్యంగా మాట్లాడటంతో కార్మికులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల రక్త మాంసాలను ఇంధనంగా వాడి కేసీఆర్ బతుకుతున్నారన్న రేవంత్, కేసీఆర్ పాలనలో సాధించినవి 2.5 లక్షల అప్పు, దేశంలో మద్యం అమ్మకాల్లో టాప్ మాత్రమేనని పేర్కొన్నారు.
టీఆర్ వాళ్ళ చెల్లెను నిజామాబాద్‌లో గెలిపించుకోలేకపోయాడు. తాను మాత్రం హుజుర్ నగర్‌లో తన అక్క పద్మావతిని గెలిపించుకుంటానన్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని.. భిన్నాభిప్రాయాలు ఉంటాయని.. కానీ అభిప్రాయ బేధాలు ఉండవన్నారు. కోర్టులతో కేసీఆర్ ఆటలాడితే మొట్టికాయలు తప్పవని.. మంత్రివర్గంలో స్పష్టమైన చీలిక వచ్చిందన్నారు. ఉద్యమ నాయకులు ఎవ్వరు ఆర్టీసీ సమ్మెపై మాట్లాడకపోవడమే దానికి తార్కాణమని రేవంత్ పేర్కొన్నారు.
సూర్యాపేటలో స్వచ్ఛందంగా సహకరించిన రోడ్డు వెడల్పు బాధితులను.. మరో ఐదు అడుగులు వెనక్కి జరగమని బెదిరింపులకు దిగడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని తెలిపారు. మూసీ గేట్లు దెబ్బతినడం.. పాలనా లోపం వల్లనే జరిగిందని.. నైతిక బాధ్యత వహించి జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.