బీఆర్ఎస్ పార్టీపై తనదైనరీతిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. భద్రాద్రి జిల్లా దళిత బంధు ఘటనపై స్పందించిన ఆయన.. ట్విట్టర్ లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రేవంత్ చేసిన ట్వీట్
‘‘గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తొమ్మిదేళ్లు గులాబీ చీడ రాష్ట్రాన్ని దోచింది. ఇంకా వారి ధనదాహం తీరలేదు. దళిత బంధు పేదల పథకమా…! బీఆర్ఎస్ నేతలకు కమీషన్ల కోసం పెట్టిన పథకమా!? ఔనులే… ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదుగా… యథా ‘కచరా’ తథా బీఆర్ఎస్ నేతలు’’
అసలేం జరిగిందంటే..?
స్వయం ఉపాధితో నిరుపేద దళితులను స్వప్రయోజకులను చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది. అయితే.. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలకు ఇది ఆదాయమార్గంగా మారింది. దళితబంధు పొందిన లబ్ధిదారులను కమీషన్ల పేరిట వేధింపులకు గురిచేస్తున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని తెలగరామవరానికి చెందిన నిరుపేద దళిత కుటుంబం కండె సరోజ – రాములు దంపతులకు దళిత బంధు పథకం కింద ప్రభుత్వం ట్రాక్టర్ మంజూరు చేసింది.
ఇన్నాళ్లూ కూలీ పనులతో బతుకీడిస్తున్న తమ బతుకుల్లో ప్రభుత్వం వెలుగులు నింపిందని వారు ఆశపడ్డారు. అయితే.. తామే దళితబంధుకు ఎంపిక చేశామని.. అందుకు రెండు లక్షల కమీషన్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తాము అంత ఇచ్చుకోలేమని వేడుకున్నారు. ప్రాధేయపడ్డారు. కానీ, బీఆర్ఎస్ లీడర్ కనికరం చూపలేదు. ప్రభుత్వం అందజేసిన ట్రాక్టర్ ట్రక్కును లాక్కెళ్లాడు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.