పెరిగిన నిత్యవసరాలతో ఇప్పటికే సతమతం అవుతున్నాడు సామాన్యుడు. బతుకు బండిని అతి కష్టం మీద నెట్టుకొస్తున్నాడు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఎడాపెడా బాదేస్తుండడంతో భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తాజాగా కేంద్రం వంటగ్యాస్, పెట్రోల్ ధరలను పెంచగా.. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు ఈఆర్సీ ఓకే చెప్పింది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.
విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన పేపర్ క్లిప్స్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు రేవంత్. పేదల నుండి మధ్య తరగతి వరకు ఎవ్వర్నీ వదలకుండా టీఆర్ఎస్ సర్కార్ కరెంట్ షాక్ ఇచ్చిందన్నారు. అటుచూస్తే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిత్యం గ్యాస్, పెట్రోల్ వాతలు పెడుతోందని మండిపడ్డారు.
మోడీ, కేసీఆర్ తీరు చూస్తుంటే.. గజదొంగల కంటే ఘోరంగా ఉందని విమర్శించారు రేవంత్. పైగా దొంగే.. దొంగా దొంగా అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేయడం సిగ్గుచేటని ఫైరయ్యారు. బైబై కేసీఆర్ హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.
రాష్ట్రంలో వచ్చే నెల 1 నుంచి కరెంట్ చార్జీలను పెంచుకోవచ్చంటూ డిస్కంలకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇళ్లకు ఒక్కో యూనిట్ పై 50 పైసలు, వాణిజ్య అవసరాలకు యూనిట్ పై ఒక్క రూపాయి పెంచుకునేందుకు ఆమోదం తెలిపింది.