కేసీఆర్ జాతీయ మంత్రం జపిస్తున్న సమయం నుంచి మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేసుకున్నారు. నిత్యం ఏదో ఒక అంశంపై ట్వీట్ చేస్తున్నారు. మోడీ సర్కార్ ను విమర్శిస్తున్నారు. తాజాగా మహిళలపై కేంద్రానికి వివక్ష ఉందని విమర్శలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇదే క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ముందు మీరేం చేశారో చెప్పండి అంటూ చురకలంటించారు.
‘‘ఐదేండ్లు మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వని మీరు.. మునుగోడు ఉప ఎన్నికలో ఒక ఆడబిడ్డను ఓడించడానికి వందల కోట్ల రూపాయలతో వేల మంది మందిమాగదులతో దండయాత్ర కాకుండా.. నిజాయితీగా ఎన్నికలను ఎదుర్కొంటామని యాదగిరిగుట్ట నర్సింహస్వామి మీద ఒట్టేసి చెప్పగలవా?’’ రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో ప్రశ్నించారు.
కేటీఆర్ ఏమన్నారంటే..?
గ్యాస్ బండపై సబ్సిడీ అడిగితే ఏడాదికి మూడు సిలిండర్లు సరిపోవా? అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెక్కిరించినట్టు మాట్లాడటం మహిళా లోకంపై బీజేపీకి ఉన్న చులకన భావానికి నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. దేశ జనాభాలో సగం ఉన్న మహిళలు తలచుకుంటే బీజేపీ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని అన్నారు. గ్యాస్ భారాన్ని, ధరల భారాన్ని ఇంకా భరించలేమని, బీజేపీ ఘోరాలను ఇక సహించబోమని మహిళలు తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు. పేద మధ్యతరగతి మహిళల వంటింట్లో నుంచే బీజేపీ పతనం షురూ కావాలని కోరారు.