ఎవరెన్ని చెప్పినా కాంగ్రెస్ పోరాటం వల్లే కేసీఆర్ దిగొచ్చారనేది రేవంత్ రెడ్డి వాదన. ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్‌ఎస్, బీజేపీ కలిసే కుట్ర చేస్తున్నాయని మొదట్నుంచి ఆయన చెబుతూ వస్తున్నారు. ఏపీలో బాగా వినిపించే 60-40 భాగస్వామ్యం డైలాగ్ ను ఇన్ డైరెక్ట్ గా బీజేపీ, టీఆర్‌ఎస్ కు ఆపాదిస్తూ విమర్శలు చేస్తూ వచ్చారు.
అయితే.. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు జరుపుతుందని కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి రేవంత్ రెడ్డి బియ్యం యుద్ధం మొదలు పెట్టారు. 8 ఏళ్లుగా రాష్ట్రంలో బియ్యం స్కాం యథేచ్ఛగా జరుగుతోందని ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ట్విట్టర్ లో ఈ కుంభకోణంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్
తెలంగాణలో ఎనిమిదేళ్లుగా సీఎంఆర్ బియ్యం స్కాం యథేచ్ఛగా నడుస్తోంది. వానాకాలం పంటలో నిజామాబాద్ జిల్లాలోనే లక్ష క్వింటాళ్లు పందికొక్కుల్లా బొక్కారంటే రాష్ట్రం మొత్తం మీద స్కాం ఏ స్థాయిలో ఉంటుంది? కేసీఆర్ కు తెలియకుండా ఇది సాధ్యమా? సీబీఐ విచారణకు ఆదేశించకుండా బీజేపీని ఆపుతున్నదెవరు?
బియ్యం స్కాం విషయంలో సీబీఐ విచారణ చేపట్టాలని పట్టుబడుతున్నారు రేవంత్ రెడ్డి. ఈ విషయంలో చొరవ చూపాలని ఈమధ్యే గవర్నర్ తమిళిసైని కూడా కోరారు. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి నిఘా పెట్టిన రేవంత్.. ఇప్పుడు బియ్యం కుంభకోణం విషయంలోనూ దూకుడుగా వెళ్తున్నారు.