తెలంగాణలో సర్పంచుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. బిల్లులు రాక.. అప్పులు తీర్చలేక.. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ వెరైటీ నిరసనలు కూడా చేస్తున్నారు. అయినా కూడా ఎలాంటి ఫలితం లేకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. రాజీనామాలకు సిద్ధమౌతున్నారు. అయితే.. సర్పంచులకు ప్రతిపక్షాలు అండగా నిలుస్తున్నాయి.
ఇప్పటికే బీజేపీ మౌన దీక్ష, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు ప్లాన్ చేస్తోంది. సర్పంచులకు ఓ భరోసాను కల్పిస్తోంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా వారికి మద్దతుగా పోరాటం సాగిస్తోంది. హస్తం నేతలు వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలోనో, ప్రెస్ మీట్లలోనో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో సర్పంచుల బాధను వివరిస్తూ పోస్ట్ పెట్టారు.
రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్
“ఆడబిడ్డకు పుస్తెల తాడు ప్రాణసమానం. ఊరికి ఉపకారం చేసినందుకు ఆ తాళినే అమ్మి వడ్డీలు కట్టాల్సిన దుస్థితి కల్పించిన దౌర్భాగ్యుడు కేసీఆర్. టీఆర్ఎస్ పాలనలో పల్లెల దుర్గతికి నిదర్శనం ఎరుగండ్లపల్లి సర్పంచ్ మాడం శాంతమ్మ దీనగాథ”.
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఎరుగండ్లపల్లికి చెందిన సర్పంచ్ శాంతమ్మ.. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో తన పుస్తెల తాడు అమ్మేసి వడ్డీలు కట్టింది. మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘పల్లెప్రగతి’ సమీక్షలో ‘బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు?’ అంటూ నిలదీసింది. దీనికి సంబంధించిన వార్తను పోస్ట్ చేసిన రేవంత్.. కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు.