– నేనేం చేశానో.. మీరేం చేశారో చెబుదాం..
– కొడంగల్ పై చర్చకు రేవంత్ సై
– మీడియాలో చర్చకు ఆహ్వానం
– ఎవరొస్తారో రండి అంటూ సవాల్
కొడంగల్ అభివృద్ధిపై టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన సమక్షంలో కోస్గిలో పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశం జరిగింది. కొడంగల్ లోని ఒక్కో బూత్ లో 500 సభ్యత్వాలు చేసిన కార్యకర్తలను సన్మానించారు. ఈ సందర్భంగా తాను మళ్ళీ కొడంగల్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు రేవంత్. ఢీల్లీకి రాజు అయినా తల్లికి బిడ్డే.. అలాగే తాను ఎంత ఎదిగినా కొడంగల్ బిడ్డనే అని ఎమోషన్ అయ్యారు.
కొడంగల్ లో 75 వేల సభ్యత్వాలు చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు రేవంత్. కొడంగల్ నేతలకు రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ, ఉచిత కరెంట్, ఆరోగ్య శ్రీ లాంటి పథకాలు వచ్చాయన్న ఆయన.. మైనార్టీలకి నాలుగు శాతం రిజర్వేషన్లు అందాయని గుర్తు చేశారు. 2009లో కొడంగల్ కు తాను కొత్త అయినా ఇక్కడి ప్రజలు కడుపులో పెట్టుకొని గెలిపించారన్నారు. వారి రుణం తీర్చుకోలేనిదని చెప్పారు. కొడంగల్ లో గుడి, బడి, రోడ్లు వేయించింది తానేనన్నారు. కోస్గి బస్ డిపో, మద్దూర్ లో స్కూల్ కు సొంత భూమి ఇచ్చినట్లు గుర్తు చేశారు.
కొడంగల్, కోస్గి, మద్దూర్ లలో జూనియర్ కాలేజీలు, కొడంగల్ లో డిగ్రీ కాలేజ్ తానే కట్టించినట్లు చెప్పారు రేవంత్. ప్రతీ గ్రామానికి రోడ్డు, వాటర్ ట్యాంక్ లు ఇచ్చినట్లు తెలిపారు. కొడంగల్ లో తాగునీటి కోసం 350 కోట్ల రూపాయలను తానే తీసుకొచ్చినట్లు వివరించారు. రెండేళ్లలో కృష్ణ నీళ్లతో కొడంగల్ ప్రజల కాళ్ళు కడుగుతా అన్న పట్నం ఏం చేశారని ప్రశ్నించారు. కొడంగల్ లో వందల కొట్లతో రోడ్లు వేసింది తానేనని.. పోలీసులను అడ్డుపెట్టుకొని తనను ఓడించారని అన్నారు.
కొడంగల్ ను దత్తత తీసుకున్న కేటీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు రేవంత్. ఈ మూడేళ్లలో కొడంగల్ రోడ్లపై తట్టెడు మట్టి తీయలేదని దుయ్యబట్టారు. 2018 లో 5 మంది మంత్రులు కోస్గి బస్ డిపో కు శంకుస్థాపన చేశారని.. దాన్ని ఎందుకు కట్టలేదో చెప్పాలని నిలదీశారు. టీఆర్ఎస్ నేతలకు ఈ సందర్భంగా నియోజకవర్గం అభివృద్ధిపై సవాల్ విసిరారు రేవంత్. కోస్గిలో 50 పడకల హాస్పిటల్ తీసుకొచ్చానన్న ఆయన.. తాను ఉన్నప్పుడు చేసిన పని ఎక్కడ ఉందో ఇప్పుడు అక్కడే ఉందని చెప్పారు.
టీఆర్ఎస్ నేతలు గుండెలపై చెయ్యి వేసుకొని చెప్పాలి.. నేను ఎప్పుడైనా అభివృద్ధికి అడ్డుపడ్డానా అని అడిగారు రేవంత్. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా.. ఎమ్మెల్యేగా ఉన్న 9 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరిపై అక్రమ కేసులు పెట్టించలేదన్నారు. ఈ మూడు సంవత్సరాలు తాను కావాలనే కొడంగల్ కు రాలేదని.. వస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నా అని అంటారని రాలేదని తెలిపారు. సిద్దిపేట, గజ్వేల్ ఎందుకు అభివృద్ది అవుతున్నాయి.. కొడంగల్ ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు.
కొడంగల్ లో తాను చేసిన అభివృద్ధి.. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై మీడియాలో చర్చ పెట్టాలన్నారు రేవంత్. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ చెక్కులు, పాస్ బుక్స్ ఇవ్వడానికే ఎమ్మెల్యే వస్తున్నారని.. దాన్ని అభివృద్ధి అంటారా? అని ప్రశ్నించారు. హకీంపేట్ గ్రామంలో ఒక యువకుడి ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు ఆంబోతుళ్ళ దాడి చేశారని.. పోలెపల్లిలో చిన్న ఘటన జరిగితే హత్యాయత్నం కేసులు పెట్టి వేధిస్తున్నారని గుర్తు చేశారు.
పోలీసులు జాగ్రత్త.. ఎప్పటికీ టీఆర్ఎస్ అధికారంలో ఉండదని ఈ సందర్భంగా హెచ్చరించారు రేవంత్. తమ వాళ్లను ఇబ్బంది పెడుతున్న ఒక్కొక్కరికి మిత్తీతో చెల్లిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు ప్రతి ఒక్కరు మామూళ్లు ఇవ్వాల్సి వస్తోందని.. వ్యాపారస్తులు నెల నెలా మామూళ్లు ఇవ్వలేక ఏడుస్తున్నారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఎవరి దగ్గరైన ఒక్క రూపాయి తీసుకున్నానా అని అడిగారు. మూడేళ్ల కాలం ఓపిగ్గా ఉన్నాం.. అది చేతగాని తనం కాదన్నారు.
తాను తలుచుకుంటే ఎలా ఉంటదో మీ ముఖ్యమంత్రిని అడుగని ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చారు రేవంత్.
కొట్లాడుదాం అంటే సరే.. గిరి గియ్ వస్తా.. వేలమంది పోలీసులతో మీ మంత్రులు వస్తే తరిమి కొట్టిన చరిత్ర మాది అని అన్నారు. సద్ది కట్టుకొని షాబాద్ వచ్చి కొడుతామని హెచ్చరించారు. రేవంత్ ఉన్నప్పుడు కొడంగల్ ఎలా ఉంది.. ఇప్పుడు సారా తాగే వాడు ఉంటే ఎలా ఉందో గ్రామాల్లో చర్చ పెట్టాలన్నారు.