సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల సమయంలో పోలీసులు కాల్పులు జరిగారు. ఈ క్రమంలో రాకేష్ అనే యువకుడు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. వారంతా గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వారిని కలిసేందుకు వెళ్లారు.
రేవంత్ వస్తున్నారని తెలిసి గాంధీ ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. అయితే.. రేవంత్ అనూహ్యంగా వెనుక గేటు నుంచి లోపలికి ప్రవేశించారు. విషయం తెలిసి పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో కాసేపు పోలీసులకు రేవంత్ కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.
ఎట్టకేలకు రేవంత్ అల్లర్లలో గాయపడిన వారిని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఉదయం రాకేష్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి వెళ్లారాయన.
మరోవైపు అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని ఏఐసీసీ పిలుపులో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గాంధీ భవన్ లోని గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని టీ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.