మిడ్ మానేరు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆదివారం ఉదయం వేములవాడలోని రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కోడె మొక్కు చెల్లించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
మిడ్ మానేరు బాధితుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందన్నారు రేవంత్. స్థానిక ఎమ్మెల్యే స్థానికత విషయంలో వివాదం ఉండగా.. విదేశాల్లో ఉండే వారికి బుద్ధి చెప్పి అభివృద్దిని కాంక్షించే స్థానికుడిని ప్రజలు గెలిపించాలని కోరుతూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ను గెలిపించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలకు వన్నవించారు.
మిడ్ మానేరు బాధితులకు ప్రభుత్వం పరిహారం విషయంలో కొర్రీలు పెడుతోందన్న రేవంత్.. పెళ్ళైన ఆడపిల్లలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇచ్చి గిరిజనులకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. దొరలకు ఒక నీతి… గిరిజనులకు ఒక నీతా? అంటూ ప్రశ్నించారు.
ఇక రాజన్న ఆలయం గురించి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దేవుడ్ని కూడా మోసం చేశారని ఆరోపించారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చి తప్పారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే ఆలయ అభివృద్ధి జరిగిందని.. మళ్లీ తాము అధికారంలోకి వస్తే భక్తుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా నిధులు తెచ్చి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు రేవంత్ రెడ్డి.