తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు
టీ కాంగ్రెస్ ఇంఛార్జ్ కుంతియాను కలసిన రేవంత్
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక అభ్యర్థిని పార్టీలో చర్చించకుండా ఎలా ప్రకటిస్తారని నిలదీత
ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్
అదిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్న కుంతియా
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక బరిలో ఉత్తమ్ పద్మావతి ఉన్నట్లు కార్యకర్తల సమక్షంలో ప్రకటించిన ఉత్తమ్
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక బరిలో పార్టీ నుంచి స్థానికుడైన శ్యామల కిరణ్‌ను బరిలో ఉంచాలని ప్రతిపాదిస్తున్న రేవంత్
అంతర్గత కుమ్ములాటలకు కేంద్రబిందువుగా కాంగ్రెస్
ఇద్దరు కీలక నేతల పంచాయితీ బహిర్గతం
ఇన్నాళ్లు అధిపత్యపోరు… ఇప్పుడు బయటపడ్డ విభేదాలు
హైదరాబాద్: రేవంత్‌రెడ్డి… ప్రస్తుత తెలంగాణ రాజకీయాలలో డైనమిక్ లీడర్. కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం. మరోవైపు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ చీఫ్. వీరిద్దరి ఆధిపత్య పోరు ఇప్పుడు వీధిన పడింది. ఇద్దరు నేతల కోల్డ్ వార్ నిన్నటి వరకు పార్టీ లోపలే వుండేది. బయటికి పొక్కలేదు. ఓ దశలో రేవంత్‌కు పీసీసీ అధ్యక్ష పదవి దక్కకుండా ఉత్తమ్ అడ్డు పడుతున్నారనే బాధ రేవంత్ వర్గంలో బాగా కనిపించేది.
ఈ అంతర్గత విభేదాలు మొన్నటి యురేనియం రౌండ్ టేబుల్ భేటీ తరువాత బయటకు పొడచుపాయి. ఉత్తమ్ తను రాజీనామా చేసిన హుజూర్‌నగర్ బైఎలక్షన్ కోసం పీసీసీ చీఫ్ హోదాలో అక్కడ నుంచి తన భార్య పద్మావతి పోటీ చేస్తారని ప్రకటించడంతో ఈ ఇద్దరి మధ్య వున్న వార్ ఉధృతం అయ్యింది. సహజంగానే ఈ అభ్యర్థిత్వాన్ని రేవంత్ తప్పుబడుతూ…. అక్కడ స్థానికుడు, పార్టీ కోసం పనిచేసే చామల కిరణ్‌రెడ్డిని ప్రతిపాదిస్తున్నట్టు ప్రకటించారు.
పనిలో పనిగా సీఎల్పీ నేతగా బట్టి విక్రమార్క ఒంటెద్దు పోకడలను తప్పుబట్టారు రేవంత్. ‘నేను సీఎల్పీలో సభ్యునిగా ఉన్నా.. గవర్నర్‌తో భేటీకి నాకు సమాచారం ఇవ్వలేదు. యురేనియంపై టీడీపీలో ఉన్నప్పటి నుంచి పోరాటం చేస్తుంటే, మహారాష్ట్రలో ఎన్నికలు వదిలేసి పవన్ కల్యాణ్‌తో కలిసి నేను చేస్తున్న పోరాటంపై సంపత్ అనవసరంగా వచ్చి మాట్లాడాడు..’ అంటూ రేవంత్ కాంగ్రెస్ పాత లీడర్లని చీల్చిచెండాడాడు.
ఉత్తమ్ సంగతి ముందు తేల్చండి… అతనికి షోకాజ్ నోటీస్ ఇవ్వండి.. అంటూ రేవంత్ ఇప్పుడు కుంతియాని వెళ్లి అడిగారు. కుంతియా ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లాలీ అంటున్నారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ రెండుగా చీలింది. వీహెచ్ వంటి సీనియర్లు… ఎటువుంటారో చూడాలి. రేవంత్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో చాణక్యం ప్రదర్శించే ‘ఆత్మ’ ఈసారి ఎటువైపు మొగ్గుతుందో అది కూడా వేచిచూడాలి.