ఓపెన్ కాస్ట్ మైన్‌తో సింగరేణి కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 10 నెలల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను కాంగ్రెస్ పరిష్కరిస్తుందన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు.
యాత్రలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఉపరితల గని ఆవరణలో కార్మికులు, కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘాల నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. అక్కడ సింగరేణి కాంట్రాక్టు కార్మికులు పడుతున్న సమస్యల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు.
తాము శ్రమ దోపిడికి గురవుతున్నామని, సమానపనికి సమాన వేతనం అమలు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు. అప్పడు కార్మికుల సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయొద్దని తాము పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీశామని ఆయన చెప్పారు. ఒకప్పుడు 70వేల మంది ఉద్యోగులు ఉండేవారని, ఇప్పుడు 40వేలకు తగ్గిపోయారని అన్నారు. కమీషన్ల కక్కుర్తి పడి ఓపెన్ కాస్ట్ గనులను ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు.
సింగరేణి ఆధీనంలో ఉన్న గనులను ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారన్నారు. గనులను కట్టబెట్టి రూ. 25వేల కోట్లు దోపీడికి పాల్పడాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. సింగరేణి సంస్థకు జెన్కో రూ.12 వేల కోట్ల బకాయి పడిందని వెల్లడించారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో సింగరేణిలో కార్మికుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
వీటన్నింటికి సింగరేణి సీఎండీ శ్రీధర్ ప్రధాన కారణమని ఆయన ఫైర్ అయ్యారు. క్రిమినల్ కేసులు ఉన్న అధికారి సీఎండీగా ఉండటానికి వీలేదని ఆయన ధ్వజమెత్తారు. రెండు మూడేళ్లు మాత్రమే ఆ స్థానంలో ఉండాల్సిన అధికారి ఏళ్లు గడుస్తున్నా ఆ పదవిలో కొనసాగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ విషయంలో ప్రధాని మోడీకి కేసీఆర్ పరోక్షంగా సహకరిస్తున్నారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మోడీ సర్కార్ సింగరేణి, ఎల్ఐసీ, విశాఖ ఉక్కులాంటి సంస్థలను ప్రైవేటుపరం చేస్తుంటే.. తాము మళ్లీ ప్రభుత్వపరం చేస్తామని కేసీఆర్ చెప్పటమే ఇందుకు నిదర్శనమన్నారు.