- కారు పార్టీలో కంగారు
- మూడు పార్టీల మధ్య గట్టి పోటీ
- రేవంత్ టఫ్ ఫైట్
- డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్న కేటీఆర్
మేమే గెలుస్తాం అంటూ ఎప్పటికప్పుడు ధీమా వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ భ్రమల్లో ఉన్నట్టుగా ఉంది. వాస్తవ పరిస్థితులు చూస్తే వీరి ఊహలకు అతీతంగా కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు పోటీ ఇవ్వవని చెప్తున్నా.. లోపల మాత్రం టీఆర్ఎస్ లో భయం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి పార్టీ నానా ఇబ్బందులు పడుతోందని టాక్.
ఇటీవల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ర్టంలో మరింత దూకుడుగా రాజకీయం చేస్తున్నాయి. కారును టార్గెట్ చేసి నేతలను లాగేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే పార్టీనీ కూడా వీడారు చాలా మంది. ఇంకా కొంత మంది పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ ను టార్గెట్ చేయడంతో కారుకు కంగారు ఎక్కువైనట్టు కనిపిస్తోంది. ఆ పార్టీపై గుర్రుగా ఉన్న వారిని కలిసి మాట్లాడి లాగేసే ప్రయత్నాలు చేస్తున్నారట రేవంత్ రెడ్డి. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో పలువురు చేరారు. ఇంకా కొంత మందిని లాగే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట ఆ పార్టీ నేతలు. అయితే తాజాగా తుమ్మల, పొంగులేటి, కడియం, జూపల్లి లాంటి నేతలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
తాజాగా రేవంత్ ఉమ్మడి రంగారెడ్డిలో బలంగా ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీని కాంగ్రెస్ లోకి లాగే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం మొదలైంది. పట్నం భార్య, వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీతా, పట్నం సోదరుడు, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
మొత్తానికి కాంగ్రెస్ ప్రయత్నాలతో మంత్రి కేటీఆర్ అలర్ట్ అయ్యారు. కేటీఆర్ ఎంటర్ అయ్యి పట్నం ఫ్యామిలీని సముదాయించి.. రంగారెడ్డి లోని ఇతర టీఆర్ఎస్ నేతలకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పట్నం ఫ్యామిలీకి పార్టీలో సముచిత స్థానం ఉంటుదని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో పట్నం ఫ్యామిలీ తాము పార్టీని వీడేది లేదని, టీఆర్ఎస్ లోనే ఉంటామని స్టేట్మెంట్ ఇచ్చారు.
ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కరీంనగర్‌లో అధికార టీఆర్‌ఎస్ పార్టీకే మొగ్గు ఉంటుందని, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు నువ్వానేనా అన్నట్లు పోటీ పడతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గంలో ఇప్పటికీ నాలుగు, ఐదు శాతం ఓట్ల ఆధిక్యతతో ఆయనే ముందున్నా గతంలో మాదిరిగా గట్టి పోటీ తప్పేలా లేదు.
హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్‌కు గెలుపు మరోసారి ఖాయంగానే భావిస్తున్నారు. జిల్లాలో బీజేపీ పోటీలో నిలిపే నాయకులను బట్టి నాలుగు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి గంగులకు పోటీ ఉంటుంది. ఇక్కడ మైనార్టీలు అధికంగా ఉండడంతో వారి ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇక్కడ ఉన్న 13 నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీ జరిగి టీఆర్‌ఎస్‌కు గతంలో మాదిరిగా 12 సీట్లు లభించే అవకాశం లేదని అనుకుంటున్నారు.
టీఆర్‌ఎస్‌కు మూడు స్థానాల్లో ప్రస్తుతానికి సంపూర్ణ ఆధిక్యత ఉన్నట్లు, కాంగ్రెస్‌కు కూడా మూడు స్థానాల్లో ఆధిక్యత ఉందని పలువురి అభిప్రాయం. అయితే ఆరు స్థానాల్లో ముగ్గురి మధ్య గట్టీ పోటీ ఉండే అవకాశాలున్నాయి.