చెట్లను పెంచడం.. నరికివేతను ఆపడం.. ఫలితంగా గాలిలో సహజంగా ఆక్సిజన్ లభిస్తుందని చెబుతుంటారు పర్యావరణవేత్తలు. ఇష్టానుసారం చెట్లను నాశనం చేస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. భవిష్యత్తులో ఊపిరి తీసుకోవడానికి ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తరచూ హెచ్చరిస్తుంటారు. ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి గుర్తు చేశారు. ప్రధాని, రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో వందలాది చెట్లను నరికివేస్తున్న తీరును ఫోటోలు, వీడియోల రూపంలో బయటపెట్టారు.
ముచ్చింతల్ లోని చినజీయర్ ఆశ్రమంలో ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు రామానుజుల సహస్రాబ్ది వేడుకలు జరగబోతున్నాయి. 216 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. 12 రోజుల పాటు ఉత్సవాలకు ప్లాన్ చేశారు. ఈ వేడుకలకు రావాల్సిందిగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి సహా ప్రముఖులను ఇప్పటికే చినజీయర్ ఆహ్వానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వేడుకలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని వస్తుండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఈ ఉత్సవాల కోసం భారీగా చెట్లను నరికివేస్తున్నట్లు ఫోటోలు, వీడియోలను బయటపెట్టారు రేవంత్ రెడ్డి.
జర్నలిస్టులతో చిట్ చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్. చిన జీయర్ స్వామికి ఓ విన్నపం చేశారు. మై హోం రామేశ్వరరావు లాంటి భూ కబ్జాకోరులను, రియల్టర్లను పక్కన పెట్టుకొని పనిచేయడం మీకే అవమానం అని అన్నారు. ఇదంతా చెబుదామంటే తనకు నేరుగా కలిసేందుకు కుదరదు కదా.. భట్టి విక్రమార్కకు పాస్ దొరికింది కాబట్టి వెళ్లి కలిశారు.. తనకు మాత్రం పాస్ లేదన్నారు. ఈక్వాలిటీ పేరు చెబుతూనే వివక్ష జరుగుతోందని చెప్పారు రేవంత్.
ఇంతకుముందు ఇదే రామానుజుల విగ్రహంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రేవంత్. దాన్ని చైనాకు చెందిన నిపుణులు తయారు చేశారని.. అలాంటి విగ్రహ ప్రారంభోత్సవానికి మోడీ ఎలా వస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు హరితహారం అంటూ పర్యావరణాన్ని కాపాడాలని చెబుతూనే విపరీతంగా చెట్లను నరికేస్తుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు.