నిజాం వారసుల కంటే కేసీఆర్ వారసులే శ్రీమంతులు అయ్యారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీఆర్‌ఎస్ ఎంపీలు ఢిల్లీలో నాటకాలు ఆడుతున్నారని.. తాను ముందుగా చెప్పినట్లే వాకౌట్ చేశారని చెప్పారు. అయితే దీనికి మోడీ, కేసీఆర్ మధ్య జరిగిన ఒప్పందమే కారణమని వివరించారు. “ముఖ్యమంత్రి గత ఢిల్లీ పర్యటనలో ఢిల్లీపై దండయాత్ర, అగ్గిపుట్టిస్తానని ఖాళీ చేతులతో వెళ్ళారు. ఏమీ చేయకుండా ఫాంహౌస్ లో పెగ్గు తాగి పడుకున్నారు. గత రెండు నెలల నుంచి రైతులు రాష్ట్రంలో అష్టకష్టాలు పడుతున్నారు. రోజూ నలుగురు, ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కేసీఆర్ పర్యటనలో ఏం చేశారో ఇప్పటివరకు చెప్పలేదు. తెలంగాణలో వరి సమస్య తీరిందా? కేంద్రం ఏమైనా నిర్ణయం తీసుకుందా? హామీ ఇచ్చిందా? మరి.. శీతాకాల సమావేశాలను ఎంపీలు ఎందుకు వాకౌట్ చేసినట్లు. ఢిల్లీలో పోరాడకుండా గల్లీకి ఎందుకు వెళ్తున్నట్లు” అని ప్రశ్నించారు రేవంత్.
చనిపోయిన రైతు కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు పార్లమెంటులో డిమాండ్ చేశాయన్న రేవంత్.. వారి వాయిస్ పక్కదోవ పట్టించేందుకే టీఆర్ఎస్ ఎంపీలు పోడియం చుట్టూ ఆందోళన చేశారని ఆరోపించారు. ఈడీలకు, బీడీలకు భయపడను అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. హైదరాబాద్ శివార్లలో రూ.3 వేల కోట్ల విలువైన భూముల విషయంలో కేసీఆర్ సన్నిహితులకు ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. వారిని పిలిచి విచారణ జరిపిందన్నారు.
Also Read: మీరు మారకపోతే.. మిమ్మల్ని మార్చేస్తా.. బీజేపీ ఎంపీలకు మోదీ వార్నింగ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 15 సంవత్సరాల క్రితం విదేశీ కంపెనీలకు రూ.450 కోట్లకు ఆ భూములను అప్పట్లో అప్పటి ప్రభుత్వం కట్టబెట్టిందని వివరించారు రేవంత్. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి నుంచి బలవంతంగా రూ.350 కోట్లకు కొనుగోలు జరిగిందని చెప్పారు. హైదరాబాద్ కు చెందిన పెద్ద రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్, టీవీ యజమానికి ఆ భూములు కట్టబెట్టారన్నారు. హెచ్ఎండీఏకు సంబంధించిన పరిధి అంతా కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పారు. ఈడీ కేసుల నుంచి తప్పించుకునేందుకే కేసీఆర్ పార్లమెంట్ లో ఎంపీలను ఆందోళన చేయమని చెప్పారని ఆరోపించారు.
ఈ భూముల వ్యవహారంలో కేటీఆర్ ని ఈడీ పిలిపించాలని చూసిందన్న రేవంత్.. చివరి నిమిషంలో వాయిదా పడినట్లు చెప్పారు. ఆయా భూముల అక్రమాల్లో మంత్రి కేటీఆర్ సంతకం చేశారని.. బీజేపీ కేటీఆర్ పై కేసులు తాత్కాలికంగా వాయిదా వేయడం వల్లే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ని వాకౌట్ చేశారని తెలిపారు. రాజకీయ ఒడంబడికల్లో భాగంగానే టీఆర్ఎస్, బీజేపీ ఇలాంటివి చేస్తున్నాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో ఎక్కడ కనిపించినా కోడిగుడ్లు, రాళ్లు, కర్రలతో కొట్టాలని పిలుపునిచ్చారు రేవంత్.
Advertisements
Also Read: కేసీఆర్ కాళ్ల కింద మట్టి కదిలింది.. భయం ఎక్కువైంది..!