హైదరాబాద్ శివారులో తాజాగా జరిగిన రియల్టర్ల హత్యల పాపం ధరణిదేనని తేల్చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అసలు ధరణి పాపం వెనుక చాలా పెద్ద కథే ఉందని.. ఈ దుర్మార్గం వెనుక బీహారీ మూలాలున్నాయని ఆరోపించారు. అసలు కేసీఆరే తన తాత ముత్తాతలు బీహార్ నుంచి వచ్చారని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారని… బీహార్ కు చెందిన సోమేశ్ కుమార్, రజత్ కుమార్, సందీప్ కుమార్ సుల్తానీయా, సీపీ అంజనీ కుమార్ లాంటి వాళ్లకు ఆయన పెద్దపీట వేస్తున్నారని తెలుగు ఐఏఎస్ లు తన దగ్గర వాపోయారన్నారు. బీహార్ ఐఏఎస్ ల బాగోతం గురించి తాను మాట్లాడుతుంటే.. ఆ రాష్ట్రానికి చెందిన ఒక మంత్రి ట్విట్టర్ లో తనపై విమర్శలు చేస్తూ కేసీఆర్ ను సమర్ధిస్తున్నారంటే అర్థం ఏంటంటూ రేవంత్ ప్రశ్నించారు. బీహార్ మంత్రికి తెలంగాణ పాలనతో సంబంధమేంటని నిలదీశారు.
అటు.. కేసీఆర్-సీఎస్ సోమేశ్ కుమార్ కుట్రలో భాగమే ధరణి పోర్టల్ అంటూ.. నిన్నటి రియల్టర్ల హత్యలు ధరణి పోర్టల్ వల్లే జరిగాయని అభిప్రాయపడ్డారు. రెవెన్యూ అధికారులు ధరణిని అడ్డుపెట్టుకుని కొత్త వాళ్లకు పాస్ బుక్కులు ఇస్తున్నారనీ.. ఆ అవకతవకల్లో భాగంగానే రియల్టర్ల హత్యల దాకా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. ధరణి పేరుతో సీఎస్ సోమేశ్ కుమార్ కనుసన్నల్లో.. సిటీ చుట్టూ ఉన్న వేల ఎకరాల భూములను కేసీఆర్ బంధువులు ఆక్రమించుకున్నారని చెప్పారు రేవంత్.
సోమేశ్ కుమార్ తప్ప తెలంగాణలో ఉన్న150 ఐఏఎస్ అధికారుల్లో నిజాయితీ-సీనియర్ అధికారులు లేరా..? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఉద్యోగం వదిలేసి ప్రైవేట్ సంస్థలో పని చేసిన జూనియర్ ఐన సోమేశ్ కుమార్ ను ఎలా సీఎస్ గా కేసీఆర్ నియమించారని మండిపడ్డారు. ఎందుకంటే. .కేసీఆర్ అవినీతిలో సీఎస్ ముఖ్య భాగస్వామి కాబట్టి అంటూ రేవంత్ తేల్చిచెప్పారు. అనర్హుడైన తనను సీఎస్ గా నియమించినందుకు కేసీఆర్ అవినీతికి సోమేశ్ తన వంతు సాయం చేస్తున్నారని ఎద్దేవ చేశారు. అందుకే.. ఏపీకి కేటాయించిన సోమేశ్ తెలంగాణలో సీఎస్ గా నియమితులయ్యారనే టాక్ ఉందన్నారు. అలాగే.. కేటీఆర్ అత్యంత సన్నిహితులు రజత్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, సందీప్ కుమార్ సుల్తానియా.. ఇలా వివిధ శాఖలు ఎందుకు బిహారీలకే కేటాయించారని ప్రశ్నించారు రేవంత్.
అటు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సాయం చేసినందుకు ఎన్నికల అధికారిగా ఉన్న రజత్ కుమార్ కు కేసీఆర్ ఇరిగేషన్ శాఖను గిఫ్ట్ గా ఇచ్చిందన్నారు. అలాగే బీహార్ కు చెందిన సీపీ అంజనీ కుమార్ ఏపీకి కేటాయింపబడిన వ్యక్తి.. కోర్టును అడ్డం పెట్టుకుని తెలంగాణలో కొనసాగుతున్నారని వివరించారు రేవంత్. అసలు డీజీపీ మహేందర్ రెడ్డిని లీవ్ లో పంపి బీహార్ కి చెందిన అంజనీ కుమార్ ను తాత్కాలిక డీజీగా నియమించడం వెనుక ఆంతర్యం ఏంటో చెప్తారా.. అంటూ ప్రశ్నించారు. డీజీపీ లీవ్ లో ఎందుకు ఉన్నారో చెప్పాలనీ.. కాలుకు ఫ్యాక్చర్ ఐతే ఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారో హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి కదా అంటూ గట్టిగా నిలదీశారు. మొత్తానికి కొట్లాడి తెచ్చుకున్నతెలంగాణ బీహారీల మయమైందంటూ మండిపడ్డారు.
తెలంగాణ బిడ్డలుగా ఇక్కడి ఐఏఎస్-ఐపీఎస్ లు మాట్లాడాల్సిన అవసరం ఉందనీ… మీ మౌనం పరోక్షంగా కేసీఆర్ దోపిడీకి సహకరిస్తుందని హెచ్చరించారు రేవంత్. కేసీఆర్ నేరాలకు ఘోరాలకు సీఎస్-అంజనీ కుమార్ అండగా ఉన్నారని ఆరోపించారు. ఇక చివరగా… కేసీఆర్ బీహార్ మూలాల మరో కోణం ప్రశాంత్ కిషోర్.. అవును.. బీహార్ కి చెందిన పీకేను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకోవటమే అందుకు నిదర్శనమన్నారు రేవంత్.