టీఆర్‌ఎస్ సర్కార్ పై నిత్యం నిప్పులు చెరుగుతున్న టీపీసీస చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. ట్విట్టర్ లో వరుస పోస్టులు పెట్టిన ఆయన పలు అంశాలపై స్పందిస్తూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
కేసీఆర్ దుష్టపాలనలో రాష్ట్ర ఖజానా దివాలా తీసిందన్నారు రేవంత్. అప్పుల ద్వారా, భూముల అమ్మకం ద్వారా, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో వ్యాట్ ద్వారా, కరెంట్, భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బస్ ఛార్జీల పెంపు ద్వారా, మద్యం అమ్మకాల ద్వారా జనం ముక్కుపిండి వసూలు చేస్తోన్న లక్షల కోట్ల సొమ్ము ఎటుపోతోందని ప్రశ్నించారు.
తెలంగాణ సీఎంఓ.. రాజకీయ విన్యాసాలు ఆపాలన్నారు రేవంత్. వెంటనే చిరు ఉద్యోగులైన హోం గార్డులు, మోడల్ స్కూల్స్ సిబ్బందికి మే నెల జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆయా వర్గాలకు అండగా కాంగ్రెస్ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు.
ఇక రైతు సమస్యలపై స్పందించిన ఆయన.. రబీలో అమ్మిన ధాన్యానికి ఇంకా సొమ్ములివ్వలేదని మండిపడ్డారు. వానాకాలం పంటకు రైతుబంధు లేదు.. రైతును వడ్డీ వ్యాపారికి వదిలి.. బీఆర్ఎస్ అంటూ కాలక్షేపం చేస్తున్నారు.. మూడు రోజుల్లో రైతుబంధు నిధులు విడుదల చేయకుంటే రైతుపోరుకు సిద్ధం కావాలని హెచ్చరించారు.