రాజన్న సిరిసిల్ల జిల్లా కలికోట సూరమ్మ ప్రాజెక్టును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శించారు. నిలిచిపోయిన పనులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల కోసం హడావుడిగా హరీష్ రావు శంకుస్థాపన చేశారని స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు పనులు అడుగు ముందుకు పడలేదన్న రైతులు రేవంత్ వద్ద వాపోయారు.
కలికోట సూరమ్మ ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి పేజ్ 2 స్టేజ్ 1ను 2005 లో 1750 కోట్లతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంజూరు చేశారని.. ఇంత మంచి ప్రాజెక్ట్ ను తీసుకొచ్చిన ఆది శ్రీనివాస్ ను ఆనాడు చెన్నమనేని రాజేశ్వర రావు అభినందించారని రేవంత్ ఈ సందర్భంగా చెప్పారు. 2018 లో టీఆర్ఎస్ ఓడిపోతుందని హరీష్ రావు కళికోట సూరమ్మ ప్రాజెక్టుకు శిలాఫలకం వేశారని చెప్పారు.
సాగు, తాగు నీటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్లలో ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. కాంగ్రెస్ నిరసనలు, పాదయాత్రలు, రాస్తారోకోలు చేసిందని..అయినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదన్నారు.
రైతులు ప్రశ్నిస్తే వరద కాలువ ద్వారా నీళ్లు ఇస్తామని చెబుతున్నారని.. ఎత్తైన ఈ ప్రాంతానికి వరద కాలువ ద్వారా నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అపర భగీరథుడు, ఇంజనీర్ కేసీఆర్ కు ఆ మాత్రం తెలియదా.. అంటూ ప్రశ్నించారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు వివక్షకు గురయ్యాయని కేసీఆర్ పదేపదే ప్రశ్నించారని..ఉమ్మడిపాలనలో సీమాంధ్రులు వివక్ష చూపినట్లే..తెలంగాణలో కేసీఆర్ కూడా అదే వివక్ష చూపుతున్నారని రేవంత్ విమర్శించారు.