టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్ మధ్య సవాళ్ల యుద్ధం నడుస్తోంది. ఖమ్మం పర్యటనకు వెళ్లిన రేవంత్.. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు, దాడులపై మాట్లాడారు. పువ్వాడ టార్గెట్ గా విమర్శల దాడి చేశారు. ఈమధ్య జరిగిన పలు ఘటనల్లో మంత్రిపై వచ్చిన ఆరోపణల గురించి ప్రస్తావిస్తూ.. అజయ్‌పై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు, పీడీ యాక్ట్ లు పెట్టించి పువ్వాడ అజయ్ రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. ఆయనకు కాంగ్రెస్ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని… అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వరంగల్ లో జరగనున్న రాహుల్ సభ సన్నాహక సమావేశాన్ని ఖమ్మం జిల్లాలో నిర్వహించారు రేవంత్. ఈ సందర్భంగా అజయ్ పై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే మాడి మసైపోతావ్ అంటూ హెచ్చరించారు. కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకొని అజయ్ బతుకుతున్నాడని.. ఇలాంటి వ్యక్తిని రాజకీయాల నుండి బయటికి గెంటేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పువ్వాడ ను బహిష్కరించమని పిలుపునిచ్చారు. కేటీఆర్, అజయ్ కు కాంగ్రెస్ గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. “రోజులు లెక్కపెట్టుకోండి.. పువ్వాడ పతానానికి 365 రోజులే ఉంది.. డైరీలో రాసుకోండి” అని కామెంట్ చేశారు.
ఇటు రేవంత్ విసిరిన సవాలుపై మంత్రి పువ్వాడ అజయ్ స్పందించారు. మమతా కాలేజీపై చేస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణనైనా చేసుకోవచ్చని తెలిపారు. భూములు కబ్జా చేశానని తనపై ఆరోపణలు చేస్తున్నారని.. ఏ విచారణకు అయినా సిద్ధమేనని స్పష్టం చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ లు చేస్తూ రేవంత్ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. సుపారీ ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నాడని ఆరోపించారు పువ్వాడ అజయ్.