కేసీఆర్ ను టార్గెట్ చేసే అంశంలో ఏ విషయాన్ని వదలడం లేదు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇప్పటికే సీఎం ముంబై టూర్ పై విమర్శనాస్త్రాలు సంధించగా.. తాజాగా వీఆర్ఓల సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు రేవంత్.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో వీఆర్ఓల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందన్నారు రేవంత్ రెడ్డి. గొడ్డు చాకిరీ చేయించుకుని.. వాళ్ల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. చాలీ చాలని జీతాలు.. ఏళ్ల తరబడి ప్రమోషన్లు లేక వీఆర్ఓల పరిస్థితి దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వీఆర్ఓలకు పే స్కేల్ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన కేసీఆర్.. ఏళ్లు గడుస్తున్నా దాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. హామీలు ఇవ్వడం తప్ప.. అమలు చేయాలన్న సోయి లేదా? అని ప్రశ్నించారు. శేషాద్రి కమిటీ ఓ కంటి తుడుపు చర్యేనన్న రేవంత్.. వీఆర్ఓలకు తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అర్హులైన వీఆఆర్ఓలకు పదోన్నతులు కల్పించాలన్నారు రేవంత్. అలాగే వాళ్లకు సొంత గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన వీఆర్ఓల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి 16 నెలలు గడుస్తోందని.. రాష్ట్రంలో విధులు లేకుండా 5, 756 మంది ఖాళీగా ఉన్నారన్నారు రేవంత్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారికి అన్యాయం జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు.