వినియోగదారులకు ఏసీడీ ఛార్జీల అంశంలో వివాదం రాజుకుంటోంది. నిత్యవసర ధరలు, పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలతో ఇప్పటికే ప్రజలు అల్లాడిపోతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు కరెంట్ డిపాజిట్ల పేరుతో వాళ్లపై మరింత భారం మోపాలనుకోవడం రాక్షసత్వమని అభిప్రాయపడ్డారు. తక్షణం ఈ నీచపు ఆలోచనను విరమించుకోవాలన్నారు. లేదంటే కేసీఆర్ మరో బషీర్ బాగ్ పోరాటాన్ని చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు సీఎంకు బహిరంగ లేఖ రాశారు.
ఏసీడీ పేరుతో వేస్తోన్న అదనపు భారాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్. వ్యాపారాల నిర్వహణకు పోలీస్ లైసెన్స్ తప్పనిసరి నిబంధనను సైతం విరమించుకోవాలన్నారు. లేనిపక్షంలో ప్రజలు, వ్యాపారుల పక్షాన కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ తో దోస్తీ చేస్తున్న వామపక్షాలు పేదలపై పడుతున్న భారాన్ని నిలువరించే ప్రయత్నం చేయాలన్న ఆయన.. లేకపోతే కేసీఆర్ పాపంలో వారు కూడా భాగస్వాములవుతారని తెలిపారు.
కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో అసమర్థ, అప్పుల భారం, ఆర్థిక సంక్షోభం తప్ప తెలంగాణకు ఒరిగింది శూన్యమని ఆరోపించారు రేవంత్. కుటంబ అవినీతి, కమీషన్ల కక్కుర్తితో ప్రభుత్వ సంస్థలు దివాలా తీశాయన్నారు. కేసీఆర్ అసమర్థతను, వ్యవస్థల పతనాన్ని కప్పిపుచుకోవడానికి విద్యుత్ ఏసీడీ ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిన అదనపు భారం మోపుతున్నారని మండిపడ్డారు. గతంలో అభివృద్ధి చార్జీలు, ఎడ్యుకేషన్ సెస్సులు, గ్రీన్ సెస్సుల పేరుతో భారం మోపారని.. మళ్లీ రెండు నెలల విద్యుత్ బిల్లుల డిపాజిట్ పేరుతో పేదవాడి జేబుకు చిల్లు పెట్టడానికి తయారయ్యారని విమర్శించారు.
ఒకవైపు ఉపాధి కరువై, ఉద్యోగాలు పోయి యువత రోడ్డున పడుతున్నారని.. ఈ పరిస్థితుల్లో విద్యుత్ డిపాజిట్ల పేరుతో ప్రభుత్వమే పేద, మధ్యతరగతి వాడిపై దోపిడీకి తెగబడటం క్షమించరానిదన్నారు రేవంత్. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, విద్యుత్ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించామని ఊరు వాడ డప్పు కొట్టుకుంటున్నారు కదా.. అదే నిజమైతే విద్యుత్ సంస్థలు 60 వేల కోట్ల నష్టాల్లోకి ఎందుకు వెళ్లాయని లేఖలో ప్రశ్నించారు.
ప్రభుత్వమే 20 వేలకోట్ల మేర బకాయి పడిన మాట వాస్తవం కాదా అని అడిగారు రేవంత్ రెడ్డి. ఛత్తీస్ గఢ్ నుండి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం లోపభూయిష్టమని.. దానివల్ల తెలంగాణ ప్రజలపై భారం పడుతుందని నిపుణులు హెచ్చరించినాపెడ చెవిన పెట్టారని మండిపడ్డారు. యాదాద్రి, భద్రాద్రి లాంటి ప్లాంట్ల నిర్మాణంలో కాలం చెల్లిన సాంకేతికతను వినియోగిస్తున్నారని అన్నారు. దాని వల్ల భారం తప్ప ప్రయోజనం లేదని గొంతు చించుకున్నా కేసీఆర్ వినడం లేదని చెప్పారు. ఈ ఒప్పందాలు, కాలం చెల్లిన నిర్మాణాలు కమీషన్లు, కుంభకోణాల కోసమేనని అర్థం అవుతోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సొంతంగా నిర్మాణం ప్రారంభించి పూర్తి చేసిన ఒక్క విద్యుత్ ప్రాజెక్టు కూడా లేదని లేఖలో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.