నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కుమార్తె వివాహం బిల్లుల పంచాయితీ చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దీనిపై విచారణకు డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఎఎస్ అధికారి రజత్ కుమార్, షెల్ కంపెనీల మధ్య ఆర్థిక లావాదేవీలపై న్యాయస్థానం పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్నఇతర అధికారులతో పాటు, ప్రభుత్వంలోని పెద్దలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కూడా విచారణ జరగాలన్నారు రేవంత్. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టాలని లేఖలో పేర్కొన్నారు. తాను చేస్తున్న డిమాండ్లపై ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్పందించకుంటే ఆయన వ్యవహార శైలిని ప్రజలు అనుమానించే పరిస్థితి ఉంటుందని చెప్పారు. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ కొంతకాలంగా జరుగుతోన్న ప్రచారం నిజమని నమ్మాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
రజత్ కుమార్ కుమార్తె పెళ్లి ఖర్చులను ప్రభుత్వ కాంట్రాక్టర్ చెల్లించినట్లు తెలిపారు రేవంత్ రెడ్డి. దాదాపు రూ.50 లక్షలు ఖర్చు చేసినట్లు లేఖలో వివరించారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ కంపెనీ మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్(MEIL)తో అనుసంధానించబడిన షెల్ కంపెనీలు(బిగ్ వేవ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్స్) రజత్ కుమార్ కుమార్తె వివాహ వేడుకకు ఖర్చులు చెల్లించాయని ఆరోపిస్తూ ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ ఆధారాలతో బయటపెట్టింది. ఇది చాలా తీవ్రమైంది.. విచారణ లేకుండా కొట్టివేయలేం అంటూ రేవంత్ రెడ్డి.. సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఆరోపణలు వచ్చి 48 గంటలు దాటినా.. సీఎం కార్యాలయం నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. విలాసవంతమైన తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో విందుతోపాటు హైదరాబాద్ లోని ప్రముఖ హోటళ్లలో ఐదు రోజుల వివాహ వేడుకలు జరిగాయన్నారు. ఖర్చులలో ఎక్కువగా బిగ్ వేవ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ బిల్ చేసిందని తెలిపారు. ఇంగ్లీష్ వెబ్ సైట్ విచారణలో హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంలో ఉన్న కంపెనీ చిరునామా నకిలీదని తేలిందన్నారు. తాజ్ కృష్ణ, తాజ్ డెక్కన్, తాజ్ ఫలక్ నుమా హోటళ్ల బుకింగ్స్, ఇతర కార్యక్రమాల్లో మెగా సంస్థకు చెందిన వారు పాల్గొన్నారని.. తమ కంపెనీ ఇమెయిల్ ఐడీలతోపాటు డమ్మీ ఇమెయిల్స్ ను కూడా ఉపయోగించారని వివరించారు.
ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్స్ డైరెక్టర్లు మెగా కంపెనీల్లో ఉన్నారని తెలిపారు రేవంత్. రజత్ కుమార్ కు మెగా సంస్థ.. దాని షెల్ కంపెనీలు బిల్లులు చెల్లించేలా చేయడం ద్వారా ఏదైనా ఫేవర్ తీసుకున్నారా? క్విడ్ ప్రోకో ప్రాతిపదికన ఇదంతా జరిగిందా? బిల్లులు చెల్లించినందకు ఆయన ఆ కంపెనీలకు ఎలాంటి సహాయం చేశారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వీటిపై రజత్ కుమార్ ను ముఖ్యమంత్రి అడగాలన్నారు. ఆరోపణలు నిజమైతే రజత్ పై అవినీతి కేసు నమోదు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ పూర్తయ్యే వరకు ఆయనకు ఎలాంటి పోస్ట్ ను కేటాయించవద్దని కోరారు. అలాగే మెగా సంస్థకు ఎలాంటి తాజా కాంట్రాక్టు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.
MP Revanth Reddy demanded a judicial probe into the allegations of corruption against the Special Chief Secretary (Irrigation) Rajat Kumar.
(@Ashi_IndiaToday)https://t.co/DTQtlogrGk
— IndiaToday (@IndiaToday) January 28, 2022
సీఎం కేసీఆర్ కి రేవంత్ బహిరంగ లేఖ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.