పోలీస్ ఉద్యోగాల వయోపరిమితిపై అభ్యర్థులు నిరసనలు కొనసాగిస్తున్న వేళ వారికి అండగా నిలబడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ ను ప్రశ్నిస్తూ బహిరంగ లేఖ రాశారు. పోలీస్ ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి పెంచాలని లేఖలో డిమాండ్ చేశారు.
ఇటీవల వేసిన ఉద్యోగాల భర్తీలో 17 వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేశారని అందులో కానిస్టేబుల్ పోస్ట్ లు అధికంగా ఉన్నాయని.. కానీ వయో పరిమితి సడలింపు కేవలం మూడేళ్లు మాత్రమే చేసారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. దీని వల్ల 4 లక్షల మంది దరఖాస్తు దారులు నష్టపోయే పరిస్థితి ఉందని వివరించారు.
తెలంగాణ ఉద్యమంలో యువత పోరాటం మరువలేనిదన్న ఆయన… వారికి 5 ఏళ్ల పాటు వయో పరిమితి ఇవ్వాలని డిమాండ్ డిమాండ్ చేశారు. ఇక్కడ ఉద్యోగాల కోసం అంతా ఇబ్బందులు పడుతుంటే హోంమంత్రి ఉన్నారో, లేరో తెలియడం లేదన్నారు. మీరేమో ఫాంహౌస్ లో సేద తీరుతున్నారని కేసీఆర్ కు చురకలంటించారు.
ఎనిమిదేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి నోటిఫికేషన్లే ఇవ్వనందున.. ఇప్పుడు చేపట్టే పోలీస్ నియామకాలకు వయో పరిమితి మరో రెండేళ్లు పెంచాలన్నారు. రాష్ట్ర నిరుద్యోగ యువతను పట్టించుకునే నాథుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థులు కోరుతున్న విధంగా వయో పరిమితి ఇవ్వాలని.. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందని స్పష్టం చేశారు రేవంత్.