హాథ్ సే హాథ్ జోడో యాత్రలో సాగిపోతున్న టీపీసీసీ రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 లో జనవరి మొదటి వారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి సంతకం పోడు భూముల సమస్యల పరిష్కారం కోసమే ఉంటుందన్నారు.
అంతే కాదు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిద్ధాంతం మంచిదేనన్న రేవంత్.. ఆయన కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్న రేవంత్.. తాను కేసులకు భయపడనని, తనకు కేసులు కొత్తేమీ కాదన్నారు.
కేసీఆర్ భూతం లాంటివాడని.. పట్టి సీసాలో బంధించాలన్నారు. లేకపోతే తట్టుకోలమన్నారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులందరూ కలిసి కాంగ్రెస్ కు సపోర్టు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. అమరవీరుల కుటుంబాలకు అనుమతి లేని ప్రగతిభవన్ ఎందుకని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ద్రోహులకే మంత్రివర్గంలో 90 శాతం పదవులు ఇచ్చారని ఆరోపించారు. కోవర్టు ఆపరేషన్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిట్టా అంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి.. అధికార పార్టీలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 3 వేల లిక్కర్ షాపులు, 60 వేల బెల్టు షాపులు ఏర్పాటు చేసి, ప్రజలను తాగుబోతులుగా చేశారంటూ ముఖ్యమంత్రి పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటి వరకూ రుణమాఫీ చేయకపోవడంతో రైతులు అప్పులపాలయ్యారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.