టీపీసీసీ రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. పత్తికి మద్దతు ధర కల్పించడంతో పాటు రైతు సమస్యలను అందులో వివరించారు. పండించిన పంటలకు మద్దతు ధర దక్కకుండా దళారులు రైతులను మోసం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
దళారుల రాజ్యంలో గిట్టుబాటు ధర రాక అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా సగటున రోజుకు ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని జాతీయ క్రైం బ్యూరో లెక్కలు చెబుతున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. ఈ నివేదిక ప్రకారం గత 2014 నుంచి 2021 వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,557 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఈ ఏడాదిలో నవంబర్ వరకు రాష్ట్రంలో 512 మంది రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారని ఆరోపించారు.
అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదన్నారు. అయితే ఎక్కవగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ప్రభుత్వం వారి కోసం ఏం చేయడం లేదన్నారు. ఈ సందర్భంగా 5 డిమాండ్లతో ఆయన కేసీఆర్ కు లేఖ రాశారు. పత్తికి క్వింటాల్ కు 15 వేలు చెల్లించాలని, తక్షణమే లక్ష రుణమాఫీ చేయాలని, ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాల ప్రైవేట్ అప్పులను వన్ టైమ్ సెటిల్ చేయాలని, కౌలు రైతులను కూడా రైతులుగా గుర్తించాలని చెప్పారు.
ఇంకా పంట బీమా పథకం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకం అమలు కాకపోవడంతోనే రైతులకు కనీసం నష్టపరిహారం కూడా అందడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఈ బహిరంగ లేఖ పై ప్రభుత్వం వెంటనే స్పందించక పోతే..క్షేత్ర స్థాయిలో పోరాటం ఉంటుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.