NH-363 విస్తరణలో భాగంగా మంచిర్యాల జిల్లా మందమర్రిలో భూములు కోల్పోయిన ఆదీవాసీలకు న్యాయం చేయాలని సోషలిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ.గుణ డిమాండ్ చేశారు. రెవెన్యూ సిబ్బందితో కలిసి కొంతమంది అధికార పార్టీ నాయకులు ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
99,130,131,141 సర్వే నంబర్లలో ఉన్న భూమిని.. రికార్డుల్లో మార్పులు చేసి అక్రమ సంపాదనకు తెరలేపారని అన్నారు. 99 సర్వే నంబర్ లో భూమిని కోల్పోయిన ఆదివాసీలకు కాకుండా అనర్హులకు అవార్డు ప్రోసీడింగ్ ఇవ్వడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 130, 131 సర్వే నంబర్లలలో అసలైన వారసులు నాలుగు కుటుంబాలు కాగా.. ఒక కుటుంబానికి చెందిన వారసులనే అర్హులుగా ప్రకటించారని మండిపడ్డారు.
141 సర్వే నంబర్ లో ముందు ఇద్దరు అన్నదమ్ములకు అవార్డు ప్రోసీడింగ్ ఇచ్చి.. ఇప్పుడు అందులో ఒకరికి భూమి లేదని ఎంక్వైరీలో తేలిందని నోటిసులు జారీ చేశారని అన్నారు. అధికార పార్టీ నాయకులు.. రెవెన్యూ అధికారులు కలిసి ఉద్దేశ్యపూర్వకంగానే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రెవిన్యూ అధికారులు లంచాలకోసం పేదల భూములను అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారో అర్ధం కావట్లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి.. జరిగిన తప్పులను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. లేదంటే బాధితుల తరుపున నిరాహారదీక్షకు పూనుకుంటామని గుణ హెచ్చరించారు.