2006, సెప్టెంబర్ 22న ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. పోలీస్ వ్యవస్థలో తప్పనిసరిగా అమలు చేయాల్సిన సంస్కరణలను ప్రకటించింది. వాటిని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. ఆ తీర్పు వచ్చి 15 సంవత్సరాలవుతున్నందున కోర్టు ఆశించిన ఫలితం వచ్చిందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
కోర్టు ఎంతో ఉన్నతంగా ఆలోచించి సంస్కరణలు సూచించినా ఫలితం పెద్దగా లేదు. గుడ్ పోలిసింగ్ పట్ల ఎవరికి చిత్తశుద్ధి లేకపోవటం, ప్రపంచం మారుతున్న దిశలో సరైన ప్రొత్సాహం ఇవ్వలేకపోవటం కూడా ఇందుకు కారణంగా విశ్లేషణలు కొనసాగుతున్నాయి. అసలు పోలీసు వ్యవస్థలో మార్పులు అవసరమా అనే వారు కూడా ఉన్నా…. ఇప్పుడున్న వ్యవస్థలో లోపాలు లేవంటే గుడ్డి వారిగా భావించాల్సిందే. సామాన్యుల పట్ల పోలీసులు అంటే అవినీతిపరులుగా, క్రూరంగా వ్యవహరించే వాళ్లే. ఇలాంటి పద్దతిలో మార్పులు రావాలంటే బలమైన సంస్కరణలు రావాల్సిందేనన్న అభిప్రాయం ఉంది.
మెరుగైన పోలీసింగ్ తోనే ఆర్థిక వ్యవస్థతో పాటు సామాజిక వ్యవస్థ కూడా బాగుంటుందని పాలకులకు అర్థం కావాలని, పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణలో వారే కీలకం అని విశ్లేషకులు అంటున్నారు. నార్వే లో ఆ దేశ ప్రధానికే తప్పు చేశారని ఫైన్ వేసేంత వ్యవస్థ ఇండియాలో ఎప్పటికి వస్తుందో అన్న చర్చ కూడా తెరపైకి రావాలంటున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో పనిచేయకుండా స్వతంత్ర్యంగా పనిచేయగల స్థితిలో ఉండాలంటున్నారు. ఇండియాలో పోలీస్ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఎన్నో సందర్భాల్లో పలు కమిషన్లు, నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకున్నా… పాత వ్యవస్థ నుండి బయట పడలేకపోతున్నారు.
సుప్రీం కోర్టు గతంలో ఏం చెప్పిందంటే…
1. రాష్ట్ర హోంమంత్రి లేదా ముఖ్యమంత్రి చైర్మన్ గా ఓ కమిషన్ ఉండాలి. ఇందులో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, ప్రతిపక్ష నేత, ఓ సామాజికవేత్తను కూడా కలుపుకోవాలి. ఈ కమిషన్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థలో మార్పులు చేర్పులు, పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
2.డీజీపీతో పాటు మరో నలుగురు సీనియర్ అధికారులతో పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డులు ఏర్పాటు చేయాలి. వీరి ఆధ్వర్యంలోనే పోలీసుల బదిలీలు, ప్రమోషన్లు జరగాలి.
3. జిల్లా, రాష్ట్రస్థాయిలలో రిటైర్డ్ న్యాయమూర్తులతో పోలీస్ కంప్లైంట్ అథారిటీని ఏర్పాటు చేసి కస్టడీలో జరిగిన మరణాలు, అత్యాచారాలపై విచారణ చేసే అధికారం ఇవ్వాలి.
4. కచ్చితంగా అమలు చేయాల్సిన మరో సూచన ఇది. మెరిట్ ఆధారంగా తప్పా రాజకీయ జోక్యం లేకుండా డీజీపీ ఎంపిక. అంతేకాదు ఆ అధికారికి కనీసం రెండు సంవత్సరాల సర్వీసు ఉంటేనే డీజీపీ పోస్టుకు అర్హులుగా భావించాలి.
కానీ ఇందులో చాలా అంశాలు అమలుకు నోచుకోవటం లేదని, అందుకే ఇండియాలో పోలీసు సంస్కరణలు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయని నిపుణులు ఆరోపిస్తున్నారు.