మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఇంటిపైన దుండగుల దాడిని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడి పట్ల రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణలో రోజు రోజుకూ శాంతి భద్రత లు క్షీణిస్తున్నాయన్నారు.
దోషులను పోలీసులు వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీహెచ్ ప్రజల మనిషి అని.. ఎవరికి ఆపద వచ్చినా ముందుంటారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై దాడి జరగడం ప్రభుత్వ భద్రతా లోపాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తోందన్నారు.
కాంగ్రెస్ నాయకులకు పోలీసులు మరింత భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులపై దాడులు జరిగితే ఊరుకునేది లేదని.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ హెచ్చరించారు.
కాగా.. కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి అద్దాలతో పాటు.. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారు ధ్వంసమైంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.