టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ వరస ఉద్యమాలకు పిలుపునిచ్చింది. అధిష్టానం పిలుపు మేరకు.. విద్యుత్ సౌధ, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ యత్నించింది.
ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు.. పలువురు కాంగ్రెస్ నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. రేవంత్ రెడ్డి ఇంటి వైపు ఉన్న రోడ్ల వద్ద బారికేడ్లు పెట్టి దిగ్బంధం చేశారు.
అదేవిధంగా ఇతర కాంగ్రెస్ నాయకులు మల్లు రవి, దాసోజు శ్రవణ్, హర్కర వేణుగోపాల్, బక్క జడ్సన్, నగేష్ ముదిరాజ్ లను సైతం పోలీసులు హౌజ్ అరెస్ట్ చేసి నిర్భందించారు.
కాగా.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, విద్యుత్ చార్జీల పెంపు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై విద్యుత్ సౌధ, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చింది.