వరంగల్ లో జరుగుతున్న రాహుల్ రైతు సంఘర్షణ సభకు అడ్డంకులు కలిగించాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. వరంగల్ లో జరగబోయే రైతు సంఘర్షణ సభకు వెళ్తున్న సమయంలో ఆయన తొలివెలుగుతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా అన్న అనుమతులు తీసుకున్న తర్వాతే వరంగల్ లో రైతు సంఘర్షణ సభను ఏర్పాటు చేస్తున్నామని.. రాహుల్ సభను డిస్టర్బ్ చేయాలని చూస్తే.. నేరుగా గజ్వెల్ ఫాం హౌజ్ కే వెళ్తామని.. డిస్టపెన్స్ అంటే ఏంటో టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు, కేటీఆర్ కళ్లకు కట్టినట్టు చూపిస్తామని హెచ్చరించారు.
జరాగాల్సి సభను శాంతియుతంగా జరగనిస్తే అందరికి గౌరవంగా ఉంటోందని.. టీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినట్టు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పోటీలోనే లేదు అనే విధంగా టీఆర్ఎస్, బీజేపీ లు నాటకాన్ని రక్తికట్టించే ప్రయత్నం చేస్తున్నాయిని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా నిలబడటంతో వారు ఆడాల్సిన నాటకాన్ని ఆడలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుందనే భయంతో సభను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కేటీఆర్ మాట్లాడే మాటలకు చేతలకు పొంతన లేదని.. దిక్కు తోచని పరిస్థితుల్లో దుష్పర్చారం చేయడానికి కేటీఆర్ ట్వీట్ లు చేస్తున్నారని మండిపడ్డారు. సవాల్ విసరడం.. పారిపోవడం.. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం.. కేటీఆర్ కు నిత్యకృత్యం అయిందని అన్నారు. పక్కరాష్ట్రాల్లో తెలంగాణను మించిన పథకాలు ఉంటే రాజీనామా చేస్తానని ప్రకటించిన కేటీఆర్ కు.. చత్తీస్ ఘడ్ లో వరి ధాన్యాన్ని క్వింటాకు రూ. 2500 ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని చూపించామని.. అయినా ఇంత వరకు రాజీనామా చేయలేదని ఆరోపించారు.
వరి ధాన్యం విషయంలో పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్రప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు.. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ గడప తొక్కలేదని అన్నారు. వారు దిగి పంపిన ఫోటోలు చూసి టీఆర్ఎస్ ఎంపీలో కేంద్రంతో పోరాడుతున్నారనే భ్రమలో ఎమ్మెల్సి కవిత ఉన్నారని అన్నారు రేవంత్. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ అనేక మంది రైతులు ప్రాణాలను కోల్పోతే.. రగ్గుకప్పుకొని పడుకున్న కేసీఆర్.. ఏ ఒక్క రోజు కూడా వారిని పరామర్శించడానికి వెళ్లలేదని విమర్శించారు.
కేసీఆర్ పక్కా రైతు వ్యతిరేకి అని విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. ఎన్ని అడ్డంకులు ఎదురైన ఉస్మానియా విశ్వ విద్యాలయానికి రాహుల్ గాంధీని తీసుకెళ్తామని తేల్చి చెప్పారు. ప్రశాంతంగా యూనివర్సిటీలో అల్లర్లు లేపేందుకే పోలీసులను పంపి ఎన్ఎస్యూఐ నాయకులను అరెస్ట్ లు చేపించారని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ లు తమ తప్పులు ఎక్కడ బయట పడుతాయో అని వణుకుతూ బతుకుతున్నారని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి.