వరంగల్ ఎంజీఎం ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన రీతిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరోగ్య శాఖ మంత్రి తీరును విమర్శిస్తూ ట్వీట్ చేశారు. కేసీఆర్ కిట్ లో మంత్రి హరీశ్‌రావుతో పాటు.. కుక్కలు, పిల్లులు, ఎలుకలు, బొద్దింకలు, నల్లులు, దోమలు చేరి పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని రేవంత్ ట్విటర్ లో పేర్కొన్నారు.
కేసీఆర్ కిట్ పేరుతో గొప్పలు చెప్పుకోవడం ఆపి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు గొప్పలు ఆపి.. ఆస్పత్రులపై, ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ట్వీట్ చేశారు.
కాగా.. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కిడ్నీ, లివర్ సమస్యలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శ్రీనివాస్ అనే రోగి మీద ఎలుకలు రెండ్రోజుల వ్యవధిలో రెండుసార్లు దాడి చేసి.. కాళ్లు, చేతుల వేళ్లు కొరికాయి. దీంతో ప్రాణాలు నిలుపుకుందామని ఇక్కడికొస్తే ఇదేం పరిస్థితి అంటూ శ్రీనివాస్ బంధువులు వాపోతున్నారు.