మొన్నటివరకు తిట్టుకున్నారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. కానీ.. సడెన్ గా కలిసిపోయారు ఆర్జీవీ, నట్టికుమార్. ఇప్పుడు వీళ్లిద్దరు మరోసారి ఆప్తమిత్రులు అయిపోయారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నారు. అలా ఉన్నఫలంగా కలిసిపోయారు ఈ శత్రువులిద్దరూ.
డేంజరస్ అనే సినిమా విషయంలో వర్మ వైఖరి నట్టికుమార్ కు నచ్చలేదు. సినిమా రిలీజ్ చేయకుండా, మరో ప్రాజెక్టుపైకి వర్మ వెళ్లడాన్ని నట్టికుమార్ సహించలేకపోయాడు. ఏకంగా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చాడు. దీంతో ఆర్జీవీకి కాలింది. నట్టికుమార్ పై రివర్స్ లో కేసు వేశాడు. పరువు నష్టం దావాతో పాటు ఫోర్జరీ కేసు పెట్టాడు.
ఇలా ఒకరికొకరు వరుసగా కేసులు పెట్టుకుంటూ, ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో ఉన్నట్టుండి వీడియో రిలీజ్ చేశాడు వర్మ. తన పక్కన నట్టికుమార్ ను కూర్చోబెట్టించుకొని మరీ మాట్లాడాడు. తామిద్దరం కలిసిపోయామన్నాడు. అటు నట్టికుమార్ కూడా అదే మాట అన్నాడు. తమ మధ్య కొంతమంది చిచ్చుపెట్టారని, ఇప్పుడు అన్ని అభిప్రాయబేధాలు సమసిపోయాయని చెబుతున్నాడు.
త్వరలోనే ఇద్దరూ కలిసి సినిమాలు కూడా చేస్తారట. ఎప్పట్లానే వీళ్లిద్దరి మధ్య మిత్రత్వం కొనసాగుతుందట. కేసులు కూడా ఉపసంహరించుకుంటారట. అదీ సంగతి.