ఎన్ని వివాదాల్లో దూరితే.. అంత పాపులారిటీ వస్తుందనుకునే వాళ్లలో దర్శకుడు రాంగోపాల్ వర్మ ముందుంటాడు. ఏరికోరి వాటిని తెచ్చుకుని వార్తల్లో ఉంటాడు. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషయంలో కాస్త అత్యుత్సాహం చూపిస్తుంటాడు. ఫ్యాన్ ని అని చెబుతూనే జనసైనికులను కవ్విస్తూ ట్వీట్స్ చేస్తుంటాడు. తాజాగా కొన్ని వివాదాస్పద ట్వీట్స్ చేశాడు. అయితే.. స్వామి వివేకానందను లాగడంపై పలువురు అభ్యంతరం చెబుతున్నారు.
మంగళవారం తన ఎన్నికల ప్రచారం రథం వారాహికి కొండగట్టులో ప్రత్యేక పూజలు చేశారు పవన్ కళ్యాణ్. కాషాయం కలర్ డ్రెస్ లో ఉన్న పవన్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలోనే వర్మ వరుస ట్వీట్లతో రెచ్చిపోయాడు. ముందుగా హిట్లర్ వాహనంపై స్వామి వివేకానంద అని ఓ పోస్ట్ పెట్టాడు.
ఆ తర్వాత.. మరో ట్వీట్ లో హిట్లర్, స్వామివివేకానంద ఇద్దరు పవన్ కళ్యాణ్ కుడి, ఎడమ కాళ్లను నొక్కుతారు.. అదీ పవన్ స్టార్ పవర్ అని సంచలన పోస్ట్ చేశాడు. అంతేకాదు, వారాహి వాహనాన్ని సాక్రెడ్ పిగ్ అని వర్ణించాడు. అనంతరం పవన్, వివేకానంద ఫోటోలను జత చేసి బలవంతుడైన వివేకానందుడు అని ఇంకో పోస్ట్ చేశాడు. పవన్ ను తిడుతూ.. వివేకానందను ఇందులోకి లాగడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే, ఎన్టీఆర్, పవన్ ఫోటోలను కూడా జత చేసి జనసైనికులను కవ్వించాడు వర్మ. ‘‘ఆ రోజుల్లో రామారావు గారు చైతన్య రథం మీద తిరిగితే, మీరు పంది బస్సు మీద తిరుగుతున్నారు అంటున్న తప్పుడు వాళ్లని బస్సు టైర్లకింద తొక్కించేయండి సార్! ఒకవేళ అలా చేయడం లీగల్ గా కుదరదనుకుంటే కనీసం కేసులన్నా పెట్టించండి’’ అంటూ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేశాడు. ఇది పవన్ ఫ్యాన్ గా తన విన్నపం అని చెప్పాడు.
‘‘గుడిలో ఉంటే అది వారాహి.. రోడ్డు మీద ఉంటే అది పంది. పీ, తన పందికి వారాహి అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్టే అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి. వెంటనే వాళ్ళ నోర్లు మూయించకపోతే మన పవిత్ర వారాహిని ఒక పంది బస్సుగా ముద్ర వేస్తారు’’ అని మరో ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా.. ‘‘డియర్ జనసైనికులారా దయచేసి #PandhiBassuVaarahi హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ అవ్వకుండా చూసుకోండి’’ అంటూ కవ్వింపు ట్వీట్స్ చేశాడు వర్మ.