టాలీవుడ్‌లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. సమాజం, వ్యక్తులతో సంబంధం లేకుండా ఎప్పుడూ తనకు నచ్చినట్లు వ్యవహరిస్తారు. డిఫరెంట్ సినిమాలతో.. అన్ని జానర్స్ టచ్ చేస్తూ ఆడియన్స్‌కి కొత్త టేస్ట్ చూపించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆర్జీవీ ‘మా ఇష్టం’ అనే పేరుతో లెస్బియన్ లవ్ స్టోరీని తెరకెక్కించారు. ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కాబోతోంది. తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటి పూర్తి స్థాయి లెస్బియన్ చిత్రంగా ‘మా ఇష్టం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఇక ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగులో ‘మా ఇష్టం’ పేరుతో విడుదలవుతుండగా.. హిందీలో ‘ఖత్రా’.. మిగతా భాషల్లో ‘డేంజర్’ అనే పేరుతో విడుదలవుతుంది. అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్న వర్మ.. దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తాజాగా వర్మ తన సినిమా ప్రమోషన్ల కోసం ‘ఆర్ఆర్ఆర్’ మానియాను వాడేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్, చరణ్ మధ్య జరిగిన సరదా మూమెంట్స్ అన్నీ ఒక దగ్గర చేర్చిన వీడియోకు ఆ సినిమాలోని నాటు నాటు సాంగ్ మ్యూజిక్‌ను యాడ్ చేసి, దానికి ‘డేంజరస్ 2.0 మా ఇష్టం’ అనే ట్యాగ్‌లైన్ జత చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక ఆర్జీవీ పోస్ట్ వైరల్ అయ్యిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
సెక్షన్ 377 రద్దు తర్వాత ఇద్దరు మహిళల మధ్య సాగే ప్రేమకథ. ఇద్దరమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకి దారి తీసింది? అనే థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ చిత్రం తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ సొంతం చేసుకున్నారు. అలాగే, సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది.