విమర్శలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడు సినిమా వాళ్లను, రాజకీయ నాయకులను టార్గెట్ చేసే ఆయన ఈ సారి హైదరాబాద్ పోలీసులను పట్టుకున్నారు. పబ్ డీజేలతో మాత్రమే పోలీసులకు సమస్య ఉంటుందా? వేరే పార్టీల డీజేల పై ఎలాంటి ఆంక్షలు లేవా? అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
జూబ్లీ హిల్స్ రోడ్ నెం.71 లో ఉన్న జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో స్కూల్ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు.ఇందులో భాగంగా పిల్లలు డీజే సౌండ్స్‌తో డ్యాన్స్‌లు చేస్తుండగా ఆర్జీవీ వీడియో తీశారు. ఆ వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసి దాన్ని మంత్రి కేటీఆర్, హైదరాబాద్ సీపీ, హైదరాబాద్ పోలీస్ అకౌంట్ కి జత చేశారు.
డీజేల్లో ఐటెమ్ సాంగ్స్ పెట్టి విద్యార్థులతో డ్యాన్స్ చేయిస్తున్నారని చెవిని చీల్చే సౌండ్ లెవల్స్ తో రాత్రి పూట జరుగుతున్న ఈ ప్రొంగ్రాంతో మీకెలాంటి సమస్య లేదా అని ప్రశ్నించారు. కేవలం పబ్‌లతో మాత్రమే అధికారులకు సమస్య ఉందా అని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
వెంటనే స్పందించిన హైదరాబాద్ పోలీసులు, జూబ్లీ హిల్స్ ఎస్‌హెచ్‌ఓ రాజశేఖర్ రెడ్డి అవసరం ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అంశాన్ని తాము చూసుకుంటామని రీట్వీట్ చేశారు.