పాకిస్తాన్ కి చెందిన ఓ యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంబీబీఎస్ డాక్టర్ అయిన ఆ అమ్మాయి పేరు షాజియా. తాను ఎలా మోసపోయానో వివరిస్తూ వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్ కు వివరించింది. ఇంపోర్ట్-ఎక్స్ పోర్ట్ బిజినెస్ అని చెప్పుకున్న ఓ కుటుంబంలోకి కోడలిగా వెళ్లి తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది.
పాకిస్తాన్ లోని లాహోర్ లో షాజియా కుటుంబం నివసించేది. కొన్ని నెలల క్రితం ఆమెకు వివాహం జరిగింది. ఆ తర్వాత 4-5 నెలలు అద్భుతంగా గడిచాయని చెప్పింది. తాను ఏ పని చేయాల్సిన అవసరం లేదని, లైఫ్ ని ఎంజాయ్ చేయమని అత్తమామలు చెప్పారని వెల్లడించింది. ఇంట్లో జిమ్, స్విమ్మింగ్ పూల్, ల్యాండర్ క్రూయిజర్, కార్లు, పని వాళ్లు ఇలా అంతా ఉండేవారు.
కొన్నాళ్ల తర్వాత ఒక్కొక్కరుగా ఇంటి నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించింది షాజియా. కుటుంబంలోని యువకులు, ముసలివాళ్లు కార్లలో ఎక్కడికో వెళ్తున్నట్లు పసిగట్టింది. ఇలా ఒక రోజు బిల్డింగ్ బేస్మెంట్ లోకి వెళ్లి చూడగా షాకింగ్ విషయాలు తెలిశాయని చెప్పింది. బిచ్చగాళ్ల వేషధారణ కోసం ఉన్న దుస్తులు, సామాన్లు అక్కడ కనిపించాయి. అనుమానం తీరేందుకు షాజియా తన కుటుంబసభ్యులను ఫాలో అయింది.
అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులు గుంపులుగుంపులుగా అడుక్కోవడాన్ని చూసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించినట్లు షాజియా పేర్కొంది. భిక్షాటన గెటప్ కోసం పర్సనల్ మేకప్ మ్యాన్ ను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపింది. తన అత్త రెండు కాళ్లు లేవన్నట్టుగా నటిస్తుంటే.. భర్త మైండ్ సరిగ్గా లేని వ్యక్తిగా అడుక్కోవడం చూశానని చెప్పింది. ఇదంతా చూసి దాదాపు నెల రోజుల పాటు కుంగిపోయినట్లు షాజియా వాపోయింది.