ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దాయాది పాక్ చాలా బలహీన స్థితిలో ఉందన్నారు. అందువల్ల పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు ఇంతకు మించిన సరైన సమయం ఉండదన్నారు.
పీఓకేను స్వాధీనం చేసుకోవడం మన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పీఓకేకు స్వేచ్ఛను కల్పించి, తిరిగి భారత్ లోకి తీసుకోవడం మన బాధ్యత అని ఆయన వెల్లడించారు. పీఓకేను మళ్లీ భారత్ లోకి తీసుకురావాలన్న బిల్లుకు తమ పార్టీ హయాంలో పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందన్నారు.
పాక్ నుంచి పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడం మోడీ సర్కార్ అజెండాలో ఓ భాగమని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కేవలం చర్చలకు మాత్రమే పరిమితం కాకూడదని ఆయన సూచించారు.
ఇక పీఓకేను స్వాధీనం చేసుకోవాలనే భారత లక్ష్యం నెరవేరబోదని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునిర్ ఇటీవల వ్యాఖ్యానించారు. తమ దేశాన్ని కాపాడుకునేందుకు తమ సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉందన్నారు. ఈ క్రమంలో హరీశ్ రావత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.