పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంపై కేంద్రాన్ని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. ప్రజలపై సిగ్గులేని దోపిడీని ఆపాలంటూ కేంద్రంపై విరుచుకు పడింది. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ మార్చి 31న నిరసనలు చేపట్టనున్నట్టు తెలిపింది.
‘ మార్చి 31న ఉదయం 11 గంటలకు గ్యాస్, పెట్రోలు మరియు ధరల అపరిమితమైన పెరుగుదలకు వ్యతిరేకంగా చెవిటి బిజెపి ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికి ప్రజలు వాళ్ల ఇంటి బయట, పబ్లిక్ స్థలాల్లో గ్యాస్ సిలిండర్లకు దండలు వేయడం, డ్రమ్స్, బెల్స్ కొట్టి చెవిటి బీజేపీ ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు’ అని వెల్లడించింది.
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచడం ద్వారా ఎనిమిదేండ్లలో బీజేపీ ప్రభుత్వం రూ. 26 లక్షల కోట్లు సంపాదించిందని కాంగ్రెస్ ఆరోపించింది. పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా మార్చి 31- ఏప్రిల్ 7ల్లో దేశవ్యాప్తంగా మూడు దశల్లో నిరసనగా “మెహంగాయ్ ముక్త్ భారత్ అభియాన్” ను పార్టీ ప్రకటించింది.
కొవిడ్ పై పోరులో ముందు వరుసలో నిలబడి పోరాడిన హెల్త్ వర్కర్లకు సంఘీ భావంగా ప్రజలందరూ చప్పట్లు కొట్టాలని పిలుపు నిచ్చారు. దీంతో చాలా మంది గంటల సహాయంతో శబ్దం చేశారు. దీని నుంచి కాంగ్రెస్ ప్రేరణ పొంది ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు కనిపిస్తోంది.