నోబాల్ విషయంలో అసంతృప్తితో ఉన్న ఢిల్లీ జట్టుకు మరో షాక్ తగిలింది. నోబాల్ విషయంలో జరిగిన రాద్ధాంతాన్ని ఐపీఎల్ పాలకమండలి సీరియస్ గా తీసుకుంది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత పెట్టింది. అలాగే.. అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రెపై ఓ మ్యాచ్ సస్పెన్షన్ ను విధించింది.
శుక్రవారం రాత్రి ఢిల్లీ, రాజస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఢిల్లీ విజయానికి లాస్ట్ ఓవర్ లో 36 పరుగులు కావాల్సి ఉండగా.. రోవ్ మెన్ పావెల్ చెలరేగి ఆడాడు. రాజస్థాన్ బౌలర్ ఒబెడ్ వేసిన 20వ ఓవర్ లో వరుసగా 3 సిక్సర్లు బాదాడు. అయితే.. మూడో బంతికి మెకాయ్ వేసిన ఫుల్ టాస్ కు అంపైర్ ఓకే చెప్పడంతో వివాదం చెలరేగింది. అది నోబాల్ అని ఢిల్లీ జట్టు వాదించింది. చెస్ట్ వరకు బంతి ఫుల్ టాస్ వచ్చిందన్నా అంపైర్ ఒప్పుకోలేదు.
ఎంత చెప్పినా అంపైర్స్ ఒప్పుకోకపోవడంతో తీవ్ర అసహనంలో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ తమ బ్యాట్స్ మెన్స్ ను గ్రౌండ్ వీడి బయటకు రావాలని పిలిచాడు. వెంటనే సహాయ కోచ్ ఆమ్రె కలగజేసుకొని గ్రౌండ్ లోకి వెళ్లి అంపైర్లతో మాట్లాడాడు. తర్వాత పరిస్థితులు సద్దుమణగడంతో మ్యాచ్ జరిగింది. చివరికి ఢిల్లీ 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
పంత్, ఆమ్రె వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. సీనియర్ ఆటగాళ్లు ఇది కరెక్ట్ కాదంటూ.. మ్యాచ్ లో అప్పుడప్పుడు తప్పులు జరుగుతుంటాయని.. అంత మాత్రానికి ఇంత గొడవ చేయాలా? అంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పాలకమండలి స్పందించి.. పంత్ కు మ్యాచ్ ఫీజులో కోత పెట్టగా.. ఆమ్రెపై ఓ మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసింది.