రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్ రిషబ్ పంత్ ను డెహ్రాడూన్ ఆసుపత్రిలోని ఐసీయూ నుంచి ప్రైవేటు వార్డుకు తరలించారు. పంత్ క్రమంగా కోలుకుంటున్నాడని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు. ఐసీయూలో మరిన్ని రోజులు ఉన్న పక్షంలో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్నందున అతడ్ని నిన్న సాయంత్రం వార్డుకు తరలించినట్టు ఆయన చెప్పారు. డిసెంబరు 30 న రూర్కీ వద్ద జరిగిన ఘోర కారు ప్రమాదంలో రిషబ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని ముఖానికి, కాళ్లకు, చేతులకు, వెన్నుకు గాయాలయ్యాయి.
కొన్ని రోజులు రిషబ్ ఆసుపత్రిలోనే ఉండవచ్చునని, అయితే కాలి మడమకు మెరుగైన వైద్య చికిత్స కోసం అతడిని విదేశాలకు తరలించాలా అన్న విషయమై బీసీసీఐ యోచిస్తోందని ఆయన చెప్పారు. అలాగే అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేయవలసిన అవసరం ఉందా అని కూడా ఆ సంస్థ తర్జనభర్జన పడుతోందన్నారు. ఇక పంత్ ను పరామర్శించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, యాక్టర్లు, అభిమానులు కూడా ఆసుపత్రికి వస్తుండడంతో ఆయనకు విశ్రాంతి లభించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విజిటింగ్ సమయాలను కూడా వారు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. పంత్ కు శారీరకంగానే కాక, మానసికంగా కూడా రెస్ట్ అవసరమని, గాయాల నొప్పితో ఇప్పటికీ బాధ పడుతున్నాడని అతనికి చికిత్స చేస్తున్న వైద్య బృందంలోని ఓ డాక్టర్ చెప్పారు. తన పరామర్శ కోసం వస్తున్నవారితో పంత్ తప్పనిసరిగా మాట్లాడవలసి వస్తోందని, అసలే గాయాల బాధలో ఉన్న అతని శక్తి హరించుకుపోతోందన్నారు.
అందువల్ల వీరంతా ప్రస్తుతానికి రిషభ్ ను విశ్రాంతి తీసుకోనివ్వాలన్నారు. ఆసుపత్రికి వస్తున్న విజిటర్లల్లో ఎవరు అతని అభిమానులో, కారో తెలుసుకునే వ్యవస్థ ఇక్కడ లేదని ఆసుపత్రి ఉద్యోగి ఒకరు చెప్పారు. ఇటీవల ఐసీయూలో ఉన్న పంత్ ను చూసేందుకు అనుపమ్ ఖేర్, అనిల్ కపూర్ వంటి నటులు, క్రికెటర్ నితీష్ రానా, ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ వంటి వారు వచ్చినట్టు ఆయన తెలిపారు.