రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్ రిషబ్ పంత్ కి బీసీసీఐ కొండంత అండగా నిలబడింది. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ లో ఆడలేకున్నా ఆయనకు పూర్తిగా.. 16 కోట్ల రూపాయల వేతనాన్ని,5 కోట్ల సెంట్రల్ కాంట్రాక్ట్ సొమ్మును చెల్లించనుంది. పంత్ వైద్య ఖర్చులను భరించడమే గాక.. ఆయన కమర్షియల్ ప్రయోజనాల బాధ్యతను కూడా తీసుకోవాలని నిర్ణయించింది.
ఢిల్లీ కేపిటల్స్ నుంచి ఆయనకు 16 కోట్ల వేతనం అందేలా చూస్తామని, అలాగే 5 కోట్ల సెంట్రల్ కాంట్రాక్ట్ పేమెంట్ కూడా ఆయనకు లభిస్తుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ మరో 6 నెలల వరకు క్రికెట్ ఆడలేడని, కోలుకోవడానికి ఇంకా సమయం పట్టవచ్చునని ఈ వర్గాలు పేర్కొన్నాయి.
గత శుక్రవారం పంత్ కి సర్జరీ జరిగింది. ఐపీఎల్ లోనే గాక.. ఆసియా కప్, ఐసీసీ వన్డే వాల్డ్ కప్ పోటీలను కూడా ఆయన మిస్ కావచ్చునని భావిస్తున్నారు. ముంబైలోని కోకిలా బెన్ ధీరూ భాయ్ అంబానీ ఆసుపత్రిలో పంత్ మోకాలికి డాక్టర్లు రెండు సర్జరీలు చేశారు. ఈ ఆపరేషన్ల నుంచి కోలుకోవడానికి ఆయనకు కనీసం 4 నెలలు పట్టవచ్చునని వైద్యులు తెలిపారు.
అలాగే మ్యాచ్ ఫిట్ నెస్ సంతరించుకోవడానికి మరో రెండు నెలలు పట్టవచ్చునని అంచనా వేస్తున్నామన్నారు. ఇటీవలే డెహ్రాడూన్ ఆసుపత్రి నుంచి విమానం ద్వారా పంత్ ను ముంబై లోని ఈ ఆసుపత్రికి తరలించారు. ఆయన విషయంలో తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది.