డిసెంబరు 30 న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ .. 18 రోజుల తరువాత తొలిసారిగా ట్వీట్ చేశాడు. తన సర్జరీ విజయవంతమైందని, కోలుకుంటున్నానని,ఇకపై వచ్చే ప్రతి సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నాడు. తనకు అన్ని విధాలుగా అండగా నిలిచిన బీసీసీఐ, జై షా, ప్రభుత్వ అధికారులకు, తన శ్రేయోభిలాషులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నాడు. వీరంతా తనకెంతో సపోర్ట్ నిచ్చారన్నాడు. వీరికి తన హృదయాంతరాళం నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నాడు. మీ ప్రోత్సాహంతో మిమ్మల్నందరినీ మళ్ళీ ఫీల్డ్ లో చూడాలనుకుంటున్నా అన్నాడు.
18 రోజుల క్రితం ఢిల్లీ-డెహ్రాడూన్ జాతీయ రహదారిలో రూర్కీ వద్ద ఘోర కారు ప్రమాదానికి గురైన పంత్ మొదట డెహ్రాడూన్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆనాడు ఇతని మోకాలికి, నుదుటిపైనా, వీపు భాగంలో గాయాలయ్యాయి. అయితే మరింత మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక విమానంలో అతడిని ముంబై తరలించారు.
ఈ నగరంలోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో పంత్ మోకాలికి సర్జరీ చేశారు. ఇది జయప్రదమైనట్టు ఇటీవల డాక్టర్లు ప్రకటించారు. ఇక రిషబ్ పంత్ ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాడన్నది ఇంకా స్పష్టం కాలేదు. అలాగే క్రికెట్ కి తిరిగి ఎప్పుడు ‘చేరువ’ అవుతాడన్నది కూడా తెలియాల్సి ఉంది.
2023 ఐపీఎల్ లో పంత్ ఆడజాలడని ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ధృవీకరించాడు అలాగే వచ్చే నెలలో ఆస్ట్రేలియాపై జరిగే గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ కి సంబంధించి భారత జట్టులో కూడా పంత్ లేడన్నారు. డాక్టర్లు కూడా పంత్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా కొంతకాలం పడుతుందని ఇటీవల పేర్కొన్నారు.