ఐపీఎల్ 2022 సీజన్ జోరుగా సాగుతోంది. సోమవారం జరిగిన 38వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తో తలపడింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో.. పంజాబ్ కింగ్స్ తరపున 32 ఏళ్ల ఆల్ రైండర్ రిషి ధావన్ ఆడాడు.
అయితే.. ధావన్ ఆరేళ్ల తర్వాత ఐపీఎల్ లో ఆడేందుకు రావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో రిషి ధావన్ ముఖానికి మాస్క్ ధరించి కనిపించి అందర్ని ఆకట్టుకున్నాడు. ధావన్ ధరించిన ఫేస్ మాస్క్‌పైన నెట్టింట్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే.. ఫేస్ మాస్క్‌తో అతను బౌలింగ్ చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.
కాగా.. దేశవాళీ టోర్నీల్లో హిమాచల్ ప్రదేశ్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించాడు రిషి ధావన్. రంజీ ట్రోఫీ ఆడుతున్న సమయంలో బౌలింగ్ వేస్తుండగా ఓ బ్యాటర్ కొట్టిన స్ట్రైట్ డ్రైవ్ నేరుగా వచ్చి రిషి ముఖానికి తగిలింది. మెరుపు వేగంతో దూసుకొచ్చిన బంతి బలంగా తాకడంతో అతని ముక్కుకు గాయం అయింది. గాయం తగ్గకపోవడంతో చేతులు తగిలినా, దుమ్ము దూళి పోయినా ఇన్‌ఫెక్షన్ అవుతుందనే ఉద్దేశంతో సేఫ్టీ షీల్డ్ తో ధావన్ బౌలింగ్ చేసినట్టు తెలుస్తోంది.
అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బౌలింగ్ చేస్తున్నప్పుడు తనను తాను రక్షించుకోవడానికి ఈ ఫేస్ మాస్క్ ధరించి ఉంటాడని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే.. బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేసిన ధావన్.. శివమ్ దూబేతోపాటు.. చివర్లో ధోనీని పెవిలియన్ చేర్చి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.