బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ విదేశీ టూర్ల కోసం అయిన ఖర్చు చూస్తే కళ్ళు తిరుగుతున్నాయంటున్నాయి విపక్షాలు. కేవలం సుమారు పది రోజుల్లో ఇందుకైన ప్రైవేట్ జెట్ల ఖర్చు 5 లక్షలపైగా యూరోలని క్యాబినెట్ ఆఫీస్ రిపోర్టు తెలిపింది. ఇది భారతీయ కరెన్సీలో రూ. 5 కోట్ల మాటే ! గత ఏడాది నవంబరు 6 న ఈజిప్టులో జరిగిన కాప్-27 సదస్సుకు హాజరయ్యేందుకు సునాక్ వెళ్ళినప్పుడు ఆ ట్రిప్ కు లక్షా 8 వేల యూరోలు, ఆ తరువాత ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో జరిగిన జీ-20 సమ్మిట్ కి హాజరయినప్పుడు మూడు లక్షల 40 వేల యూరోలు ఖర్చయ్యాయి.
. గత డిసెంబరులో ఆయన లాత్వియా, ఎస్టోనియా టూర్ వెళ్ళినప్పుడు 62 వేలకు పైగా యూరోలు ‘హారతి కర్పూరమయ్యాయని ‘ది గార్డియన్ పత్రిక తెలిపింది. అసలే దేశం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఈ దుబారా ఖర్చులు.. పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృధా చేయడమేనని లిబరల్ డెమాక్రాట్లు విరుచుకపడుతున్నారు.
తమ బిల్లులు చెల్లించలేక ప్రజలు సతమతమవుతున్నప్పుడు ఇలా మంచి నీళ్లలా డబ్బును వృధా చేయడం దిగ్భ్రాంతికరమని లిబరల్ డెమాక్రాట్ అధికార ప్రతినిధి వేరా హాబ్ హౌస్ వ్యాఖ్యానించారు. ‘గ్రీన్ డే’ గురించి సునాక్ ప్రభుత్వం గొప్పగా చెబుతుందని, కానీ వాస్తవానికి ఈ ప్రధాని తానిచ్చిన హామీలను తానే అతిక్రమిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇక ప్రధాని వెంట విదేశాలకు వెళ్లే అధికారుల బృందాలకు అయ్యే జెట్ విమానాల ఖర్చు కూడా తక్కువేమీ కాదన్నారు.
రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి బిజినెస్ కార్యకలాపాలపైనా విపక్షాలు సునాక్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇటీవలి బడ్జెట్ పాలసీ .. ఆమె నేతృత్వం లోని ‘ కోరు కిడ్స్ లిమిటెడ్’ అనే సంస్థకు ప్రయోజనం కలిగించేదిగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను రిషి సునాక్ అధికార ప్రతినిధి కొట్టిపారేశారు. విపక్షాలు ఏదో ఒక నెపంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటాయని, నిజానికి ప్రపంచ నేతలతో సమావేశమయ్యేందుకు సునాక్ విదేశాలకు వెళ్తున్నారంటే అది అంతర్జాతీయ సమస్యలపై పరస్పర సహకారాన్ని పెంపొందించడానికి ఉద్దేశించినవేనని ఆయన చెప్పారు.