యూకే ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభానికి ఎట్టకేలకు తెర పడిన విషయం తెలిసిందే. మన ఇన్ఫోసిస్ మూర్తి గారు అల్లుడు అధిష్ఠానాన్ని అధిరోహించారు. అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత ఆయన మీడియాకు కనిపించలేదు. కానీ ఆయన కోసం వారి ఇంటి వద్ద వేచి ఉన్న జర్నలిస్టులకు, మీడియా ప్రతినిధులకు అక్షతా మూర్తి టీ అందించారు. ఈ విషయం ఇప్పుడు ట్విటర్ లో వైరల్ గా మారింది.
ఛాన్సలర్ గా రాజీనామా చేసినప్పటి నుండి తరువాత ఆ స్థానాన్ని ఎవరు అధిరోహిస్తారన్న సంశయంలో ప్రజలు ఉండగా అప్పటికే రేసులో ఉన్న ముగ్గురిలో రిషి సునాక్ ఆ స్థానంలోనికి వచ్చారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. లండన్‌లోని ఆయన ఇంటి వెలుపల ఆయన కోసం ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు స్వయంగా అక్షతా మూర్తే టీ, బిస్కెట్లు అందించడం సర్వత్రా చర్చానీయాంశమైంది.
ఎన్నో కోట్లకు అధిపతికి అయిన అక్షతా మూర్తి ఏమాత్రం డాబులకు పోకుండా వారికి టీ అందివ్వడం ఆమె నిరాడంబరతను అందరూ మెచ్చుకుంటున్నారు. ఆమె టీ ఇచ్చిన ఒకో టీ కప్పు ధర దాదాపు రూ.3,600 ఉంటుందని తెలుస్తోంది.
అయితే దీని మీద కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఆమె తమ గొప్పతనాన్ని చూపించడం కోసమే అటువంటి టీ కప్పుల్లో టీ ఇచ్చారని.. అంత అతి చేయాల్సిన అవసరం లేదని ఓ నెటిజన్ పేర్కొన్నారు.
మరో నెటిజన్ ఆ టీ కప్పు ఖరీదుతో ఓ కుటుంబం రెండు రోజుల పాటు బతకొచ్చని తెలిపారు. మరొకరు అవుట్ టచ్ అని పేర్కొన్నారు.
రిషి సతీమణి అక్షతా మూర్తిపై వచ్చిన పన్ను ఎగవేత ఆరోపణలు సునాక్‌ను కాస్త ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ వివాదంపై రిషి స్పందించలేదని విమర్శలు ఉన్నాయి. అక్షతకు.. ఇప్పటికీ భారత పౌరసత్వమే ఉంది. వేరే దేశంలో స్థిర నివాసం ఉన్న వారికి బ్రిటన్‌లో నాన్-డొమిసైల్ పన్ను హోదా ఇస్తారు. ఇది పొందిన వారు విదేశాల్లో తాము ఆర్జించే ఆదాయానికి బ్రిటన్‌లో పన్ను కట్టక్కర్లేదు.
ఈ హోదాను అడ్డుపెట్టుకొని అక్షత.. పన్ను ఎగవేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే తాము చట్టప్రకారం బ్రిటన్‌లో చేస్తున్న వ్యాపారాలకు పన్ను చెల్లిస్తున్నానని అక్షతా మూర్తి ప్రతినిధి అప్పట్లో తెలిపారు. ఆ తర్వాత ఆ ప్రయోజనాలను తాను పొందబోనని ప్రకటించారు అక్షతా మూర్తి. తన భర్త పదవికి ఇబ్బందిగా మారకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.