– నగరంలో రెచ్చిపోతున్న కామాంధులు
– వారం రోజుల్లో వెలుగులోకి ఆరు ఘటనలు
– నిందితుల్లో అధికంగా మైనర్లు
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః… ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు చరిస్తారని పెద్దలు చెబుతుంటారు. కానీ.. తెలంగాణలో ఆడపిల్లలకు రక్షణ లేకుండాపోతోంది. మదమెక్కిన కామాంధులు క్రూర మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. బాలికల్ని ట్రాప్ చేసి.. అత్యాచారాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ లో వారం రోజుల్లో వెలుగుచూసిన ఆరు ఘటనలు చూసి.. ఆడపిల్లను బయటకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు.
ముందుగా అమ్నేషియా పబ్ వ్యవహారం ఎంతటి దుమారం రేపిందో చూశాం. గత నెల 28న 17 ఏళ్ల మైనర్ బాలికను ట్రాప్ చేసి.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు మృగాళ్లు. నిందితులు టీఆర్‌ఎస్, ఎంఐఎం నేతల పిల్లలు కావడంతో కేసులో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు. దీనిపై వివాదం కొనసాగుతోంది. అసలు నిందితులను తప్పించారని.. సీబీఐ విచారణకు పట్టుబడుతున్నాయి. ఈ ఘటనపై చర్చ జరుగుతుండగానే.. మరో ఐదు ఘోరాలు వెలుగు చూశాయి.
రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న బాలికను ఇంటి దగ్గర దింపుతానంటూ కలీమ్ అలీ అనే క్యాబ్ డ్రైవర్ ట్రాప్ చేశాడు. డెక్కన్ ప్యాలెస్ కు వెళ్లి తన స్నేహితుడు లుక్మాన్ ను కారులో ఎక్కించుకున్నాడు. వీరిద్దరూ కలిసి బాలికను రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ గ్రామంలోని లుక్మాన్ ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
మే 30న చార్మినార్ సమీపంలోని బస్టాప్ వద్ద 16 ఏళ్ల బాలిక వేచి ఉన్న సమయంలో సుఫియాన్ అనే వ్యక్తి ఆమెతో మాటలు కలిపాడు. మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు.
వసతిగృహంలో ఉంటూ చదువుకుంటన్న బాలికను.. హాస్టల్ కు సమీపంలోని జిరాక్స్ షాపులో పనిచేసే సురేష్ అనే యువకుడు ట్రాప్ చేశాడు. గిఫ్టులు ఇచ్చి ఆమెను లోబరుచుకోవాలని ప్లాన్ చేశాడు. ఆమె స్నేహితుడి బర్త్ డే పార్టీని ఆసరాగా చేసుకుని నెక్లెస్ రోడ్డులో కారులోనే అత్యాచారం చేశాడు సురేష్.
రాజేంద్రనగర్ పరిధిలో తనతోపాటు చదువుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి ఇద్దరు విద్యార్థులు సినిమాకు తీసుకెళ్లారు. అత్తాపూర్ లోని ఓ థియేటర్ కు వెళ్లారు. సినిమా మధ్యలో ఒకడు కూల్ డ్రింక్ తాగుదామంటూ చెప్పి బయటకి తీసుకెళ్లి.. అక్కడే నిర్మానుష్య ప్రాంతంలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఇక సికింద్రాబాద్ కార్ఖానా పరిధిలో మైనర్ బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ధీరజ్, రితేష్ అనే యువకులతో బాలికకు కొన్ని నెలల క్రితం ఇన్ స్టాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే రోజూ మాట్లాడుతూ బాలికతో చనువు పెంచుకున్నారు. మాయ మాటలు చెప్పి హోటల్ కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో వీడియోలు తీసి బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం జరిపారు. వీడియోలు ఇస్తామని నమ్మించి మరికొందరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
నెల రోజుల వ్యవధిలో జరిగిన ఈ ఆరు ఘటనలు అమ్నేషియా ఘటన తర్వాతే వెలుగుచూశాయి. ఈ వారం రోజుల్లో బాధితులు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసుల్లో ఎక్కువమంది నిందితులు మైనర్లే. చిన్న వయసులోనే ఇలాంటి ఘోరాలకు పాల్పడుతుండడం కలవరపెడుతోంది.