గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా విజయం సాధించారు. అధికార బీజేపీ టికెట్ పై ఆమె ఉత్తర జామ్ నగర్ ప్రాంతం నుంచి పోటీ చేశారు. సమీప అభ్యర్థిపై ఆమె 61,065 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఈ సందర్భంగా రివాబా మాట్లాడుతూ.. తనకు టికెట్ ఇచ్చిన బీజేపీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో తన కోసం ప్రచారం చేసిన కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. ఇది కేవలం తన విజయం మాత్రమే కాదని పేర్కొన్నారు. ప్రజలందరి విజయమని ఆమె అన్నారు.
ఈ ఎన్నికల్లో విజయం సాధించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి అధికార బీజేపీ అత్యధిక స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.
రాష్ట్రంలో బీజేపీ విజయం దాదాపు ఖాయమైంది. రాష్ట్రంలో మొత్తం 182 స్థానాలు ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు 103 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 51 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకు పోతున్నారు. దీంతో బీజేపీ నేతలు సంబురాల్లో మునిగిపోయారు.