బీహార్ లో ఎన్నికలు పూర్తై, నితీష్ కుమార్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేశాక కూడా రాజకీయాల వేడి తగ్గటం లేదు. తృటిలో ప్రభుత్వ ఏర్పాటును కోల్పోయిన ప్రతిపక్ష ఆర్జేడీ ఓవైపు ప్రభుత్వంలో ఉన్న మంత్రుల అవినీతి చరిత్రను ప్రశ్నిస్తూనే, మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై మైండ్ గేమ్ మొదలుపెట్టింది.
నితీష్ కుమార్ జేడీయూ పార్టీకి కేవలం 43స్థానాలు వచ్చినప్పటికీ, 74 స్థానాలు గెలిచిన బీజేపీ సీఎం పదవిని వదులుకుంది. కానీ సీఎంగా నితీష్ పేరుకే ఉంటారని, అధికారమంతా బీజేపీయే చెలాయిస్తుందని ఆర్జేడీ ఆరోపించింది. డమ్మీ సీఎంగా ఉన్నప్పటికీ త్వరలో నితీష్ సర్కార్ కూలటం ఖాయమని, మీరే బయటకు వచ్చి ఆర్జేడీకి మద్ధతివ్వండని ఆ పార్టీ నేత అమర్ నాథ్ సంచలన ప్రకటన చేశారు.
కేంద్రంలోనూ బీజేపీయేతర కూటమి అవసరం ఉందని, జాతీయ కూటమికి మీరే నాయకత్వం వహించాలని కూడా ఆర్జేడీ ఆఫర్ చేసింది. ఓవైపు నితీష్ ను ఆహ్వానిస్తూనే… బీజేపీ కుట్రలతోనే ఎన్నికల్లో గెలిచిందని, అసలైన విజయం ఎక్కువ సీట్లు గెలిచిన తమదేనని ఆర్జేడీ మరోసారి వ్యాఖ్యానించింది.